భారత్‌లో జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు భారీ కుట్ర

భారత్‌లో జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు భారీ కుట్ర జరుపుతున్నట్లు నిఘా సంస్థలు నిగ్గు తేల్చాయి. ఇటీవల అసోంలో పట్టుబడ్డ అల్‌ కాయిదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌-కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌), దాని అనుబంధ సంస్థ అన్సారుల్‌ బంగ్లా టీమ్‌ (ఏబీటీ) ఉగ్రవాదులతో ఈ కుట్ర వెల్లడైనది. 

ఇప్పటికిప్పుడు దేశంలో విధ్వంసాలకు పథకాలు రూపొందించలేదని, అయితే, తొలుత జిహాదీ భావజాలాన్ని విస్తరించడం. స్లీపర్‌సెల్స్‌ను భారీగా రిక్రూట్‌ చేసుకోవడం వీరి ప్రధాన టాస్క్‌ అని గుర్తించారు. జులై   24న గోల్‌పరా జిల్లా పకీయుర్వా గ్రామానికి చెందిన అబ్బాస్‌ అలీ అనే 21 ఏళ్ల ఇమామ్‌/మదర్సా టీచర్‌ అరెస్టు తర్వాత అసోంలో ఏక్యూఐఎస్‌ మాడ్యూల్‌ మూలాలు వెలుగులోకి వచ్చాయి.

అబ్బా్‌సను విచారించగా వెలుగులోకి వచ్చిన వివరాలతో గడిచిన 20 రోజుల్లో 37 మంది ఏక్యూఐఎస్‌, ఏబీటీ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు అస్సాం పోలీసులు తెలిపారు.

‘‘పశ్చిమ బెంగాల్‌లో గత నెల 17న అరెస్టయిన అబ్దుల్‌ రఖీప్‌ అనే ఉగ్రవాదితో వీరికి సంబంధాలున్నట్లు తేలింది. గత  నెల 21న పట్టుబడ్డ మసీదుల్లో ఇమామ్‌లుగా, మదర్సా టీచర్లుగా పనిచేస్తున్న అబ్దుస్‌ సుభాన్‌, జలాలుద్దీన్‌ షేక్‌తోపాటు,  గత శుక్రవారం పట్టుబడ్డ హఫీజ్‌ రెహ్మాన్‌ ముఫ్తీ అనే మదర్సా టీచర్‌ ఈ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తులు’’ అని ఆయన వివరించారు.

బార్‌పేటలో తాజాగా పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులు– అక్బర్‌ అలీ, అబ్దుల్‌ కలాం ఆజాద్‌లకు మధ్యప్రదేశ్‌లో ఇటీవల అరెస్టయిన ఏక్యూఐఎస్‌ టెర్రరిస్టులకు సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ అమితావ సిన్హా వెల్లడించారు. అసోంలో పట్టుబడ్డ ఉగ్ర శిక్షకులు, స్లీపర్‌సెల్స్‌, సానుభూతిపరులు, టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా అల్‌ కాయిదా ద్వారా జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేయడానికి కుట్రలు పన్నారని పోలీసులు గుర్తించారు.

వీరు మదర్సాలు, మసీదుల్లో ‘ధర్మసభ’ల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి, యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్లు తేల్చారు. ‘‘ఏడుగురు ఉగ్రవాదులు మా కస్టడీలో ఉన్నారు. వీరు వెంటనే విధ్వంసాలకు కుట్రలు పన్నడం కంటే.. జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేయడంపై దృష్టి సారించారని గుర్తించాం. ఇందులో భాగంగా దేశంలో రిక్రూట్‌మెంట్లు పెంచాలని పథకాలు రూపొందించారు. ఎక్కడికక్కడ స్లీపర్‌సెల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండగా అరెస్టయ్యారు’’ అని గోల్‌పరా ఎస్పీ వీవీ రాకేశ్‌రెడ్డి తెలిపారు.

కాగా, పోలీసుల దర్యాప్తులో ఏక్యూఐఎస్‌ ఉగ్రవాదులు నిర్వహించిన ‘ధర్మసభ’లకు బంగ్లాదేశ్‌తో పాటు, భారత్‌లోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు తేలింది. దీంతో.. అసోంకు వచ్చిన వారు ఎవరు? ఏయే రాష్ట్రాల నుంచి వచ్చారు? ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారా? అనే కోణంలో నిందితులను ప్రశ్నిస్తున్నారు.

అసోంలో అక్రమంగా కొనసాగుతున్న మదర్సాలపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ స్పష్టం చేశారు. బార్‌పేటలో అరెస్టయిన ఉగ్ర శిక్షకుడు టీచర్‌గా పనిచేస్తున్న మదర్సా అక్రమ నిర్మాణమని, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించారంటూ పోలీసులు సోమవారం ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు.

గోల్‌పరా మదర్సా విషయంలోనూ పోలీసులు ఇలాంటి నివేదికనే అందజేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ తరహా మదర్సాలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి మదర్సాల్లో అల్‌ఖైదా శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.

మూడు మదరసాల కూల్చివేత

ఇలా ఉండగా, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నమూడు  మదరసానులను గత నెలలో అస్సాం ప్రభుత్వం  కూల్చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా పని చేస్తున్న మదరసాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా బుధవారం అస్సాంలోని బొంగాయిగావ్ జిల్లా, కబైటరీ పార్ట్-4 గ్రామంలో ఉన్న మర్కజుల్ మా-అరిఫ్ క్వారియానా మదరసాను కూల్చేశారు.

దీని కోసం ఎనిమిది బుల్డోజర్లను వినియోగించారు. మదరసాలోని ఓ బోధకుడు ముఫ్తీ హఫీజుర్ రహమాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెట్  సభ్యుడని పోలీసులు తెలిపారు. ఇతను 2018లో ఈ మదరసాలో బోధకుడిగా చేరినట్లు తెలిపారు. ఈ మదరసాలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో అభ్యంతరకరమైన వస్తువులు, సాహిత్యం బయటపడ్డాయని చెప్పారు.