ఓ గర్భిణీ మృతి చెందితే పోర్చుగల్  ఆరోగ్య మంత్రి రాజీనామా! తెలంగాణాలో?

భారత్ కు చెందిన ఓ గర్భిణి (34) సకాలంలో చికిత్స అందక పోర్చుగల్ లో గుండెపోటుతో మృతిచెందింది.ఈ ఘటన చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మార్తా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. అంబులెన్స్ లో నగరంలోని ఇతరత్రా ఆస్పత్రులకు తీసుకెళ్లిన క్రమంలో ఆ గర్భిణి గుండె ఆగి తుది శ్వాస విడిచింది. వెంటనే అత్యవసర సిజేరియన్ చికిత్స అందించి, ఆమె శిశువును మాత్రం ప్రాణాలతో కాపాడారు.
పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ప్రధాన ఆస్పత్రి శాంటా మారియాలో నియోనాటాలజీ సేవలు లేవు. దీంతో మరొక ఆస్పత్రికి అంబులెన్స్‌లో గర్భిణిని తరలిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి గుండెపోటుకు గురై మృతి చెందింది.  ఈ ఘటన పోర్చుగల్‌ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో  రాజీనామ చేసే పరిస్థితికి దారితీసింది. అ‍త్యవసర ప్రసూతి ఆస్పత్రులను తాత్కలికంగా మూసివేయాలని ఆమె తీసుకున్న నిర్ణయమే రాజీనామా చేసే వరకు తీసుకొచ్చింది.
వాస్తవానికి గత వేసవి సెలవుల్లో పలు ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో వారంతాల్లో ఉండే అ‍్యతవసర ప్రసూతి సేవలను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ప్రతిపక్షాలు, మున్సిపాలిటీలు గర్భిణులు ఎమర్జెన్సీ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లలేరని, ఇది అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ దుమ్మెత్తిపోశాయి.

సిబ్బంది కొరత కారణంగా గత్యంతరం లేని స్థితిలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. టెమిడో 2018లో ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు కరోనాకు వ్యతిరేకంగా విజయవంతమైన వ్యాక్సిన్‌ ప్రచారాన్ని నిర్వహించింది కూడా.  అత్యంత ప్రజాదరణ పొందిన మంత్రుల్లో ఆమె ఒకరు. ఐతే ఆమె ప్రసూతి వైద్యానికి సంబంధించిన విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో పాటు తాజాగా సదరు గర్భిణి మహిళ కూడా చనిపోవడం ప్రతిపక్షాల విమర్శలకు ఆజ్యం పోసినట్లయింది.

ఈ మేరకు టెమిడో ఆరోగ్య మంత్రిత్వ శాఖ్య ప్రకటనలో తాను ఇక పదవిలో కొనసాగే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని, అందువల్ల తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణియించుకున్నట్లు వెల్లడించింది. ఐతే దీన్ని పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియాఓ కోస్టా టెమిడో రాజీనామను ఆమోదించడమే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యావాదాలు కూడా తెలిపారు.

ఆ విధంగా నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా ఓ దేశ ఆరోగ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ తెలంగాణాలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంభ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్న నలుగురు బాలింతలు మృతి చెందితే ఆరోగ్యమంత్రి టి హరీష్ రావు ఉలకరు. అందుకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోరు.

మరోవంక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు అసలు ఈ విషయం పట్టనే లేదు. ఏమి జరిగిందో విచారించే తీరిక కూడా  లేదు. రాజకీయాల కోసం ఎక్కడికో పాట్నాకు వెళ్లారు.  తన అల్లుడు హరీశ్ రావును కాపాడుకునేందుకు కేసీఆర్ డాక్టర్లను బలి చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనలో డాక్టర్ల లైసెన్స్ ను రద్దు చేస్తామనడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఈ విషయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైఫల్యం ఉందన్న  సంజయ్ ముందుగా  హరీశ్ రావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.