తెలంగాణ డబ్బులు తెచ్చి ఇతర రాష్ట్రాల్లో పంచుతున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ తెలంగాణ డబ్బులు తెచ్చి ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో 15 శాఖలు ఉన్నాయని, ఆ కుటుంబం మారితేనే తెలంగాణ బాగుడుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ప్రగతిభవన్ లోనే ఉన్నాయన్న ఆయన రాష్ట్రాన్ని కేసీఆర్ నవ్వుల పాలు చేస్తుండని విమర్శించారు.
 ఇతర రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ను ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదని అంటూ  ఆయన మాట్లాడుతుంటే లేచి వెళ్లిపోతున్నారని నితీష్ కుమార్ ను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరు రక్షించలేరని స్పష్టం చేశారు.
“ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కేంద్రంపై విమర్శలు చేసేందుకే కేసీఆర్‌ పర్యటనలు చేస్తున్నారు. కేసీఆర్‌ తీరును చూసి తెలంగాణను చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీలు కేసీఆర్‌ను లైట్‌ తీసుకున్నాయి. బీహార్‌ వెళ్లి ఏదో చెప్పాలనుకున్నారు. కేసీఆర్‌ మాటలు వినలేక బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ వెళ్లిపోతుంటే కేసీఆర్‌ బ్రతిమాలుకున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.
ఇతర రాష్ట్రాలతో పాటు మునుగోడు ఉపఎన్నిక ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని తెలిపారు. హామీల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్ 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారని నిలదీశారు. 
 
హిందూ దేవుళ్లను కించపరిచిన మునావర్ షో లను అనేక రాష్ట్రాలు నిషేధిస్తే కేసీఆర్ సర్కార్ మాత్రం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందాం అంటే సీఎం అందుబాటులో ఉండరని విమర్శించారు.
 
ఈడీ, సీబీఐ అంటే సీఎంకు భయమెందుకు..?
నితీశ్‌కుమార్‌, అఖిలేశ్‌ యాదవ్‌, కేజ్రీవాల్‌.. ఎవరూ కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడలేరని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐలకు కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పదే పదే దర్యాప్తు సంస్థల పేరును ప్రస్తావిస్తున్న ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఈడీ, సీబీఐ దాడులు చేస్తే.. సానుభూతి పొందాలని చూస్తున్నారని చెప్పారు.
‘‘బిహార్‌లో ఇద్దరు నాయకులు కలిసి కూర్చునే పరిస్థితే లేదు.. ఇక కేసీఆర్‌ దేశాన్ని ఏకం చేస్తాడా..?’’ అని ఎద్దేవా చేశారు. బిహార్‌లో కేసీఆర్‌ మాట్లాడిన మాటలు వినలేక సీఎం నితీశ్‌ లేచి వెళ్లిపోతుంటే.. చేయిపట్టి కూర్చోమని కేసీఆర్‌ బ్రతిమాలినా ఆయన వెళ్లిపోయారని గుర్తుచేశారు.
తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలు చనిపోయారని, వరదలకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అన్నం సరిగా లేక హాస్టళ్లలో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని, సర్కారు ధాన్యం కొనకపోవడంతో రైతులు ఆందోళన చెందుతుంటే.. కేసీఆర్‌ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.
మోదీది నీతివంతమైన పాలన అని సీఎం కేసీఆర్ గజ్వేల్లో పొగిడారని గుర్తు చేశారు.  అయితే హూజూరాబాద్ లో గెలవగానే అది అవినీతి పాలన అయ్యిందని కిషన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. కేసీఆర్ లాంటి వాళ్లకు బీజేపీ భయపడదని స్పష్టం చేశారు.  మోదీ పాలనలో దేశంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలు తీర్చే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ రానున్న ఎన్నికల్లో కేసీఆర్ వారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.