మరోసారి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య బంధం బహిర్గతం

కేసీఆర్‌ వ్యాఖ్యల ద్వారా మరోసారి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య బంధం బీహార్ పర్యటన సందర్భంగా బహిర్గతమైందని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్‌ ఉచ్చులో నితీష్‌ కుమార్‌ చిక్కుకున్నారని ఆయన హెచ్చరించారు.
 
 తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేసీఆర్ బిహార్ పర్యటనకు వెళ్లారని ధ్వజమెత్తారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తుందని చెబుతూ రాహుల్ గాంధీ మీ నాయకుడా..?  ఎవరు మీ నాయకుడు అంటే కూర్చొని మాట్లాడుకుంటం అన్నారని పేర్కొన్నారు. 
 
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పదే పదే కూర్చోమని బ్రతిమిలాడే పరిస్థితి కేసీఆర్ కు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఎమర్జెన్సీ విధిస్తే.. నేడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్బంధాలు, ఆంక్షలు, అరెస్టులతో ఎమర్జెన్సీ తలపిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. 
 
నితీశ్ కుమార్, కేసీఆర్ ను పట్టించుకోలేదని చెబుతూ కేసీఆర్ తెలంగాణ పరువు తీశారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు పాలయ్యారని స్పష్టం చేశారు. ప్రగతి భవన్, ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్ అదే ప్రపంచమనుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు దేశ రాజకీయమంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ధాన్యం కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని సీఎం కేసీఆర్‌.. బీహార్‌ వెళ్లి అక్కడి వారికి చెక్కులు ఇవ్వమేంటి?. కన్న తండ్రికి బువ్వపెట్టని కొడుకు.. మేనమామకు మంగళ హారతి పట్టిన చందంగా కేసీఆర్‌ తీరు ఉందని ఎద్దేవా చేశారు.
 
 ఇక, టీడీపీతో పొత్తు అనేది ఊహాజనిత, అసత్య ప్రచారం మాత్రమే.. బీజేపీతో టీడీపీ పొత్తు  అని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలసి పోటీ చేస్తుందని.. రోజురోజుకు అక్కడ బీజేపీ బలం పెరుగుతుందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని తెలిపారు.