జాతీయ రాజకీయాలలో కేసీఆర్ ను తిరస్కరించిన నితీష్ 

దేశం మొత్తం చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ లో తాను పెట్టిన ప్రెస్ మీట్ ను బలవంతంగా ముగించాల్సి రావడం గమనిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రవేశాన్ని బహిరంగంగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరస్కరించారని స్పష్టం అవుతుందని బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు వెల్లడించారు.
 
జాతీయ రాజకీయాల్లోకి తనకేమి దేశం నలుమూలల నుండి గొప్ప స్వాగతం దొరకదని ఇక్కడ కేసీఆర్ అర్ధం చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు.  ఎందుకంటే ఈయన లాగా దేశారాజకీయాల్లో ఏదో చేయాలని పగటి కలలు కంటున్నవారు అక్కడ చాలామందే ఉన్నారని ఎద్దేవా చేశారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కానీ, బీహార్ రాష్ట్రంలోని ప్రజలు కానీ ఈయన తరహాలో రెండేసి గంటలు ప్రెస్ మీట్లు పెడితే వినడానికి  ఎవరూ సిద్ధంగా లేరని కృష్ణ సాగర్ రావు తెలిపారు.  నిజానికి బుధవారం బీహార్ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కేసీఆర్ కు ఓ పెద్ద అవమానం అని స్పష్టం చేశారు. 
 
పైగా, ఇది దేశంలోని ప్రతిపక్షాల్లో ఉండే అనైక్యతకి నిదర్శనం అని బిజెపి నేత చెప్పారు. ముందుగా కేసీఆర్ ఏ తెలంగాణ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో ఆ స్వంత రాష్ట్రం పై శ్రద్ధ పెట్టాలని, అనవసరంగా బయటికి వెళ్లి రాజకీయ దుస్సాహసాలు చేసి అవమానాలు, సిగ్గుతో తల దించుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు.
ఇప్పటికైనా, కేసీఆర్ తెలంగాణపై, ఇక్కడి పాలనా యంత్రాంగంపై, ఇక్కడి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని బీజేపీ ఆయనకు సలహా ఇస్తుందని కృష్ణ సాగర్ రావు స్పష్టం చేశారు.