సేవా పక్వాడా పేరుతో మోదీ పుట్టినరోజు వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు వేడుకలను ఈసారి 15 రోజుల పాటు జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకూ సేవా పక్వాడా పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దళితవాడలలో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, పలు ఇతర సేవా కార్యక్రమాలు జరుపుతారు. 
 
దీనికి సంబంధించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కార్యకర్తలకు లేఖలు రాశారు. రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు, వికలాంగులకు ఉచితంగా పరికరాలు అందజేయడం, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను ఈ సమయంలో నిర్వహించాలని ఆయన సూచించారు. 
 
మోదీ ఎట్ 20 సప్నే హుయే సాకార్ పేరిట ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేస్తారు. జిల్లా స్థాయిల్లో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తారు. కరోనా బూస్టర్ డోసులు తీసుకోవాలని కూడా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తారు. కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాల ఫొటోలు తీసి నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.
సెప్టెంబర్ 25న భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని నద్దా పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండున ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాక ఖాదీకి ప్రచారం కల్పించాలని కోరారు.
గత ఏడాది ప్రధాని మోదీ జన్మదినం రోజున దేశ వ్యాప్తంగా 2.5 కోట్ల మందికి కరోనా టీకాలు వేయించడం ద్వారా ప్రపంచంలో ఒకే రోజు జరిగిన అత్యధిక టీకాలుగా చరిత్ర సృష్టించారు. పార్టీ అనుబంధ విభాగాలైన యువమోర్చా, కిసాన్ మోర్చా, మహిళా మోర్ఛాలు కూడా ఈ పక్షం రోజులలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం బీజేపీ జాతీయ స్థాయిలో ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఉపాధ్యక్షుడు రఘుబర్‌దాస్, జాతీయ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య, తదితరులు ఈ కమిటీలో ఉన్నారు.