నెలరోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోతుంది

దేశం మొత్తం మునుగోడు వైపే చూస్తోందని చెబుతూ మునుగోడులో బీజేపీ గెలిస్తే నెలరోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోతుందని మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటూ తన ప్రాణం ఉన్నంతవరకు మునుగోడును వదిలిపెట్టనని స్పష్టం చేశారు. 
 
నియోజకవర్గ సమస్యలపై కేసీఆర్‌తో మాట్లాడే దమ్ము టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు లేదని ఎద్దేవా చేశారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చినా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయరని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరితేనే ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే రాజీనామా చేశానని చెబుతూ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. 
 
మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్‌ పోటీచేసినా విజయం తనదేనని  రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని అంతకు ముందు రోజు మునుగోడులో కార్యకర్తల సమావేశంలో సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని తెలిపారు.
 
కేసీఆర్‌ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్‌ కేసులో దొరికిపోయారని గుర్తు చేశారు.  రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు 
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకొని కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి మునుగోడులో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నిక మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి జరుగుతున్న ధర్మ యుద్ధమని పేర్కొన్నారు. తాను అమ్ముడుపోయేవ్యక్తిని కాదని స్పష్టం చేస్తూ మోసపూరిత మాటలతో తనను ఓడించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.