పాక్ వరద ప్రళయం… వెయ్యికి మించిన మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో మృతుల సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంది. వరద సంబంధిత సంఘటనల కారణంగా గత 24 గంటల్లో మరో 119 మంది మృతి చెందడంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 1033 కు చేరుకోగా, 1527 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

దేశంలో జూన్‌ 14 నుంచి భీకర వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ, నైరుతి పాకిస్తాన్‌లో తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మెజార్టీ సంఖ్యలో 76 మరణాలు గత 24 గంటల్లో సింధ్ ప్రావిన్స్ లోనే జరిగాయి.  సింధ్‌లో 347మంది, బెలోచిస్థాన్‌లో 238, ఖైబెర్ ఫంక్తుంఖ్వాలో 226. పంజాబ్‌లో 168,పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 38, గిల్‌గిత్ బాల్టిస్థాన్ లో 15. ఇస్లామాబాద్‌లో ఒకరు మృతి చెందారు. వరదల వల్ల 3451.5 కిమీ రోడ్డు ధ్వంసం అయింది.

147 బ్రిడ్జిలు తుడుచుపెట్టుకుపోయాయి. 170 షాపులు ధ్వంసం అయ్యాయి. దాదాపు 9,49,858 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్నాయని నేషనల్ డైసాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (ఎన్‌ఎండిఎ) ఆదివారం వెల్లడించింది. కొన్ని వందల కోట్ల రూపాయల మేరకు ఏర్పడిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. 

అనుకోకుండా సంభవించిన ఈ విపత్తులో సహాయం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలను ఆయన అర్థించారు. ఆగస్టు 30 నాటికి పాక్‌కు 160 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించాలని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను తాజాగా అభ్యర్థించింది. మిత్రదేశాలు సహాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. 1.5 మిలియన్ పౌండ్లు సహాయ కార్యక్రమాలకు అందిస్తామని బ్రిటన్ ప్రకటించింది.

యుఎఇ, టర్కీ, ఇరాన్ తమ సహాయం అందిస్తామని షరీఫ్‌కు తెలియజేశాయి. తక్షణం 3000 టన్నుల ఆహార సరఫరాలు, వైద్య, ఔషధ అందించడానికి యుఎఇ సంసిద్ధమైంది. ఈలోగా ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ క్వమర్ జావేద్ బజ్వా వేర్వేరుగా బెలుచిస్థాన్, సింధ్, తదితర వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను తక్షణం ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.