హైటెక్ నౌక యువాన్ వాంగ్ 5పై చైనాకు భారత్  చురకలు 

కొలంబోకు ప్రస్తుతం మద్దతు కావాలని, అనవసరమైన ఒత్తిడి, అనవసర వివాదాలతో ఇతర దేశాల ఎజెండాను రుద్దటం కాదు” అంటూ శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి ఇటీవలే హైటెక్‌ నిఘా నౌకను చైనా తీసుకు రావడంపై తలెత్తిన  వివాదాల విషయంలో ఆ దేశంకు భారత్ సున్నితంగా చురకలు అంటించింది.

ఈ నౌకను హంబన్‌టోటాలో కొన్ని రోజులు నిలిపి ఉంచటంపై భారత్‌  వ్యక్తం చేసిన ఆందోళనలను తోసిపుచ్చుతూ చైనా రాయబారి చేసిన వాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. ఆయన ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించడం వ్యక్తిగత లక్షణం కావచ్చు లేదా ఆ దేశ వైఖరిని సూచించొచ్చు. చైనా రాయబారి క్వి జెన్‌హాంగ్ భారతదేశం పట్ల చూపుతున్న దృక్పథం అతని స్వంత దేశం ఎలా ప్రవర్తిస్తుందనే దానిని సూచిస్తోంది’ అంటూ ఘాటుగా స్పందించింది.

`భారత్ అందుకు చాలా భిన్నమని ఆయనకు తెలుపుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకకు మద్దతు అవసరం. కానీ అనవసరమైన ఒత్తిడి, ఇతర దేశాల ఎజెండాను రుద్దేందుకు అవసరం లేని వివాదాలు కాదు.’  అని ట్వీట్‌ చేసింది శ్రీలంకలోని భారత హైకమిషన్‌.

భారత్‌ అభ్యంతరాలపై చైనా రాయబారి గత శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భద్రతా పరమైన ఆందోళనలను లేవనెత్తటం బయటినుంచి అవరోధం కలిగించటమేనని పేర్కొన్నారు. అలాగే,  అది శ్రీలంక సార్వభౌమత్వం, స్వంతంత్రతలో కలుగజేసుకోవటమేనని భారత్‌పై ఆరోపణలు చేశారు.

అయితే, నౌకపై శ్రీలంక, చైనాలు ఉమ్మడిగా చర్చించి ఇరు దేశాల ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత‍్వం, స్వతంత్రతను కాపాడుకునేందుకు నిర్ణయించటం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ నౌక మొదటి షెడ్యూలు ప్రకారం ఆగస్టు 11న ఈ నౌకాశ్రయానికి రావలసి ఉంది. అయితే భారత దేశం భద్రతాపరమైన ఆందోళన వ్యక్తం చేయడంతో శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ నౌకాశ్రయాన్ని చైనాయే నిర్వహిస్తుండటంతోపాటు శ్రీలంకలోని ముఖ్య నేతలు కూడా ఒత్తిడి చేయడంతో ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇవ్వక తప్పలేదు.

అయితే కొన్ని షరతులను విధించింది. శ్రీలంక ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో ఈ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను స్విచాన్ చేసి ఉంచాలని, శ్రీలంక జలాల్లో ఎటువంటి శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించరాదని తెలిపింది. ఆగస్టు 16 నుంచి 22 వరకు హంబంటోటా పోర్టులో ఈ నౌకను నిలిపేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ నౌకలోని ట్రాకింగ్ సిస్టమ్స్ భారత దేశ రక్షణ వ్యవస్థల సమాచారాన్ని రహస్యంగా తెలుసుకునే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని చైనా రాయబారి కీ ఝెంహోంగ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, భారతదేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పరుష వ్యాఖ్యలు చేశారు.

ఝెంహోంగ్ వ్యాఖ్యలపై శ్రీలంకలోని భారత హై కమిషన్ శనివారం తీవ్రంగా స్పందించింది. సైంటిఫిక్ రీసెర్చ్ నౌక యువాన్ వాంగ్ 5ను హంబంటోటా నౌకాశ్రయానికి తీసుకురావడానికి భౌగోళిక రాజకీయ సందర్భాన్ని ఆపాదించడం ఓ సాకు మాత్రమేనని మండిపడింది.

భారత దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆగస్టు 12న మీడియాతో మాట్లాడుతూ, చైనా వ్యాఖ్యలను  తీవ్రంగా ఖండించారు. శ్రీలంకపై తాము ఒత్తిడి తెచ్చామని చైనా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. భద్రతాపరమైన అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.