తైవాన్‌ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు

అమెరికా నావికా దళానికి చెందిన రెండు యుద్ధనౌకలు ఆదివారం తైవాన్‌ జలసంధి గుండా ప్రయాణించాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వివాదాస్పద తైవాన్‌ పర్యటనతో అమెరికా, చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం తెలిసిందే. ఓ వైపు చైనా హెచ్చరికలు చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గటం లేదు.

ఇందుకు ప్రతిగా తైవాన్‌ చుట్టూ చాలా రోజుల పాటు చైనా యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను మోహరించి,  భారీ సైనిక విన్యాసాలకు తెర తీసింది. ఆ తర్వాత తైవాన్‌ జలసంధిలో యూఎస్‌ యుద్ధనౌకల సంచారం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన యుఎస్‌ఎస్ అంటియిటం, యుఎస్‌ఎస్ చాన్సెలర్స్‌విలే ఇక్కడ సాధారణ స్థాయిలోనే సంచరిస్తున్నాయని ప్రత్యేకత ఏదీ లేదని అమెరికాకు చెందిన సెవెన్త్ ఫ్లీట్ తెలిపింది. ఎటువంటి అతిక్రమణలు లేకుండా తమ యుద్ధ నౌకలు నిర్ణీత కారిడార్‌లో ఉన్నాయని తెలిపారు.

‘ఏ దేశ తీర ప్రాంత భూభాగానికి తాకకుండా జలసంధిలో తమ నౌకలు ప్రయాణించాయి. అమెరికా మిలిటరీ, నౌకాదళాలు.. అంతర్జాతీయ చట్టాలు అనుమతించే ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వర్తిస్తాయి. ఈ నౌకల ప్రయాణం ఇండో పసిఫిక్‌లో శాంతి, సామరస్యత కోసం అమెరికా నిబద్ధతను సూచిస్తుంది.’ అని పేర్కొంది జపాన్‌లోని వాషింగ్టన్‌ 7న బెటాలియన్‌.

అయితే ఈ నౌకల కదలికలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా అధికారికంగా తెలిపింది. తాము అప్రమత్తంగా ఉన్నామని వివరించింది. తైవాన్, ఇతర ప్రాంతీయ భాగస్వాములను తృప్తి పరిచేందుకే అమెరికా ఈ దుందుడుకు చర్యకు దిగిందంటూ చైనా విమర్శలు చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా.. తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది. అమెరికా యుద్ధనౌకలు అన్ని కదలికలు తమ పర్యవేక్షణలో ఉన్నాయని స్పష్టం చేశారు.

చైనాకు చెక్ భారత్ కే సాధ్యం 

ఇలా ఉండగా,  భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు చెక్‌పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని  అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్‌ గిల్డే కీలకవ్యాఖ్యలు చేశారు.  భారత్‌ నుంచి చైనాకు రెండు సవాళ్లు ఎదరవుతాయని గిల్డే పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని చైనాను బలవంతం చేస్తున్నారని, కానీ చైనా వాస్తవానికి పక్కనున్న భారత్‌ను గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దక్షిణ ఆసియాలో భారత్ బలమైన దేశంగా ఉండటం అమెరికా, జపాన్‌కు అవసరం అని స్పష్టం చేశారు. భారత్‌తో  జాగ్రత్తగా ఉండాలనేలా చైనాను అప్రమత్తం చేయాలని సూచించారు. భారత్, అమెరికా సైన్యాలు గతేడాది అక్టోబర్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించిన విషయాన్ని గిల్డే గుర్తు చేశారు. అప్పుడే చైనాకు భారత సవాల్ అవుతుందని అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం గడిపినట్లు చెప్పుకొచ్చారు.