ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్‌ విజయం

ఆసియాకప్ భారత్ దాయాది పాక్‌పై సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత దళం విజృంభించడంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ 26 పరుగులకే 4 వికెట్లు తీసి పాక్ కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు. 

ఆల్‌రౌండర్ హార్దిక్ చెలరేగి 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వీరికి అర్షదీప్ 2, ఆవేశ్‌ఖాన్ ఓ వికెట్ తీసి సహకరించారు. దీంతో పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ టాపార్డర్ తడబాటుకు గురైనా మిడిలార్డర్ ఆదుకోవడంతో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 

19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. భారత్ విజయంలో కోహ్లీ జడేజా హార్దిక్ 33 పరుగులుతో కీలకపాత్ర పోషించారు. ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం గ్రూప్ ఎలో దాయాదులు భారత్‌పాక్ మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ రసవత్తరంగా జరిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్‌సేన బౌలింగ్ ఎంచుకుని పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్, వికెట్‌కీపర్ రిజ్వాన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. రిజ్వాన్ స్ట్రైక్ తీసుకోగా భారత్ బౌలింగ్ ఎటాక్‌ను భువనేశ్వర్ ఆరంభించాడు.

రెండో బంతికి ఎల్బీని తప్పించుకున్న రిజ్వాన్ మూడో బంతికి సింగిల్‌తీసి పాక్ పరుగుల ఖాతా తెరిచాడు. అనంతరం నాలుగో బంతిని మిడాఫ్ మీదుగా బాబర్ బౌండరీకి తరలించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. మొదటి ఓవర్లో పాక్ ఖాతాలో ఆరు పరుగులు చేరాయి. అనంతరం లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్ ప్రారంభించాడు.

తడబాటుకు గురైన ఆర్షదీప్ రెండు వైడ్లు, ఓ బౌండరీతో పాటు మొత్తం 8పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో మరోసారి బౌలింగ్‌కు దిగిన సీనియర్ పేసర్ భువీ భారత జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. కెప్టెన్ బాబర్‌ను పెవిలియన్‌కు పంపి పాక్‌కు షాక్ ఇచ్చాడు.

9బంతుల్లో 2ఫోర్లుతో 10పరుగులు చేసిన బాబర్.. భువీబౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్‌ఇచ్చి ఔటయ్యాడు. భువీ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేయబోయిన బాబర్ బంతి టాప్‌ఎడ్జ్‌కు తాకడంతో అర్షదీప్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. 15పరుగులు వద్ద పాక్ తొలి వికెట్‌పడింది. 

ఏడో ఓవర్లకు పాక్ స్కోరు హాఫ్‌సెంచరీ మార్కుదాటి పరుగులుకు చేరింది. 8వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన లెగ్‌స్పిన్నర్ యుజ్వేద్ర చాహల్ 8 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ దశలో లెఫ్టార్మ్ స్పిన్నర్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌కు దిగి పాక్‌జోరుకు కళ్లెం వేశాడు. 

ప్రతి ఓవర్లో కనీసం ఒక్క బౌండరీ అయినా నమోదు చేస్తున్న పాక్ బ్యాటర్లు జడేజా బౌలింగ్‌లో కేవలం సింగిల్స్‌తో నాలుగు పరుగులు మాత్రమే రాబట్టారు. భారత్ స్పిన్నర్లు పాక్‌ను కట్టడి చేయడంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. 

12వ ఓవర్లో చాహల్ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఇఫ్తికర్ లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టడంతో పాక్ స్కోరు పుంజుకుంది. కానీ పాక్ ఆనందాన్ని హార్దిక్ క్షణాల్లో ఆవిరి చేశాడు. తర్వాత ఓవర్లో తొలి బంతికే ఇఫ్తికర్‌ను అడ్డుకుని పెవిలియన్‌కు పంపాడు. హార్దిక్ వేసిన బౌనర్‌ను ఎదుర్కొవడంలో విఫలమైన ఇఫ్తికర్ వికెట్‌కీపర్ కార్తీక్ చేతికి దొరికిపోయాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, ఓ 28 పరుగులు చేసిన ఇఫ్తికర్ పెవిలియన్ బాటపట్టాడు.

87 పరుగుల వద్ద పాక్ మూడో కీలక వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఓవర్లో పాక్‌ను హార్దిక్‌పాండ్య కోలుకోలేని దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ ఓవర్లో హాఫ్‌సెంచరీ దిశగా దూసుకుపోతున్న రిజ్వాన్‌ను అడ్డుకుని తొలిబంతికిపెవిలియన్‌కు దారి చూపించాడు. 

అనంతరం మూడో బంతికి ఖుష్‌దిల్ హార్దిక్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈక్రమంలో 15 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఈ దశలో చివరి ఐదు ఓవర్లలో 35 పరుగులు మాత్రమే చేసిన పాక్ 3 వికెట్లు కోల్పోయింది. 

17వ ఓవర్లో బరిలోకి దిగిన భువీ మరోసారి పాక్‌ను దెబ్బతీశాడు. ఆసిఫ్ అలీ బౌలింగ్‌లో సూర్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్లకు పాక్ స్కోరు 114/6కు చేరింది. తరువాత ఓవర్లోనే అర్హదీప్ బౌలింగ్‌లో నవాజ్ కీపర్‌క్యాచ్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. 114 పరుగుల వద్ద పాక్ 7వ వికెట్ కోల్పోయింది. ఇదే ఓవర్లో రవూఫ్ రెండు బౌండరీలు సాధించడంతో మొత్తం పదిపరుగులు పాక్ ఖాతాలో చేరాయి. 19వ ఓవర్లో భువీ బౌలింగ్‌లో షాదాబ్‌ఖాన్ (10) వికెట్ల ముందుదొరికిపోయి ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. 

ఈక్రమంలో మూడో బంతికి నసీమ్‌షా ఎల్బీ రూపంలో డకౌట్ అయ్యాడు. ఈక్రమంలో భువీ భారత్ తరఫున పాక్‌పై టీ20ల్లో 4/26తో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చివరిఓవర్లో బౌలింగ్‌కు దిగిన అర్షదీప్ విజృంభించి దహానీ (16)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. 

19.5 ఓవర్లలో 147 పరుగులు చేసిన పాకిస్థాన్ ఆలౌట్ అయింది. భారత భువీ నాలుగు వికెట్లు తీయగా, హార్దిక్ 3వికెట్లు, అర్షదీప్ 2, ఆవేశ్‌ఖాన్ ఓ వికెట్‌తో పాక్‌ను కుప్పకూల్చారు.

పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కెప్టెన్ రోహిత్, రాహుల్ బరిలోకి దిగారు. అయితే తొలి ఓవర్లోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ అరంగేట్ర బౌలర్ నసీమ్ షా సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన రాహుల్ (0)ను తొలి ఓవర్లోనే క్లీన్‌బౌల్డ్ చేశాడు. 

వన్‌డౌన్‌లో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. రోహిత్, కోహ్లీ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి చేసింది. 8వ ఓవర్లో రోహిత్ సిక్సర్ బాది జోరుమీద కనిపించినా చివరిబంతికి ఇఫ్తికర్ అహ్మద్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు 2 వికెట్లకు 50 పరుగులుకు చేరుకుంది. ఈక్రమంలో కోహ్లీని నవాజ్ ఔట్ చేశాడు.

10ఓవర్లకు స్కోరు 62/3కు చేరింది. జడేజా, సూర్యకుమార్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో టీమిండియా స్కోరు నెమ్మదించింది. సూర్యకుమార్ (18)ను నసీమ్‌షా బౌల్డ్ చేయడంతో 89పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు స్కోరు 97రన్స్ నమోదవగా లక్ష్యం 30 బంతుల్లో 51 పరుగులకు చేరింది. 

ఈక్రమంలో జడేజా, హార్దిక్ భారత ఇన్నింగ్స్‌ను ఆదుకుని జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. జడేజా నవాజ్ బౌల్డ్ చేయడంతో ఉత్కంఠ చేరింది. 5బంతుల్లో 7పరుగులు అవసరమయ్యాయి. హార్దిక్ విన్నింగ్ షాట్ సిక్సర్ కొట్టడంతో భారత్ విజయం సాధించింది. మొత్తంమీద రోహిత్‌సేన 19.4 ఓవర్లలో 148పరుగులు చేసి ఘన విజయంసాధించింది.