జన్ ధన్ ఖాతాదారులలో 56 శాతం మంది మహిళలే 

ఎనిమిదేళ్ల క్రితం ఆగష్టు 28, 2014న మొదలైన  ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)  క్రింద 46 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలను తెరవడం జరిగింద,. వీటిలో రూ. 1.74 లక్షల కోట్ల డిపాజిట్ బ్యాలెన్స్‌‌‌‌ ఉండగా, ఖాతాదారులతో 56 శాతం మంది మహిళలే అని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
ఈ ఫ్లాగ్‌‌షిప్ ఫైనాన్షియల్ ఇన్‌‌క్లూజన్ స్కీమ్ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జన్​ధన్​ ఖాతాల ద్వారా నేరుగా నగదు బదిలీలు (డీబీటీ) పెరిగాయని చెప్పారు. రూపే కార్డ్‌‌ల వాడకం ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించామని తెలిపారు.
ప్రతి కుటుంబమే కాదు ప్రతి ఒక్కరికీ ఫైనాన్షియల్​ ఇన్​క్లూజన్​ ఫలాలు అందాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్​, ఇన్సూరెన్స్​, లోన్​ సేవలను అందించడానికి పీఎంజేడీవైని అందుబాటులోకి తెచ్చారు.  అర్హులైన లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద  నేరుగా నగదు బదిలీ ​ద్వారా డబ్బును జమ చేస్తున్నామని నిర్మల వివరించారు.
ఖాతాదారులతో 67 శాతం మంది  గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందినవారే అని ఆమె తెలిపారు. దీని వల్లన అందుబాటులో లేని వారికి బ్యాంకింగ్ సేవలు, ఆర్ధికంగా రక్షణ లేనివారికి రక్షణ, ఆర్ధిక సదుపాయం పొందలేనివారికి సదుపాయం లభించేటట్లు చేయగలుగుతున్నామని ఆర్ధిక మంత్రి వివరించారు. పైగా, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి దారితీసిన్నట్లు తెలిపారు. 
కరోనా మహమ్మారి సమయంలో పిఎం- కిసాన్ కింద రైతులకు డబ్బు పంపామని, పిఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద మహిళా పీఎంజేడీవై ఖాతాదారులకు ఎక్స్‌‌గ్రేషియా చెల్లించామని ఆమె చెప్పారు.  తాజా లెక్కల ప్రకారం మొత్తం 46.25 కోట్ల పీఎంజేడీవై ఖాతాల్లో 37.57 కోట్లు (81.2 శాతం) పనిచేస్తున్నాయి.
కేవలం 8.2 శాతం పీఎంజేడీవై ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు కాగా, ఒక్కో ఖాతాకు సగటు డిపాజిట్ రూ.3,761. అర్హత కలిగిన పీఎంజేడీవై ఖాతాదారులను ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై),  ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్​బీవై) ఫలాలను అందిస్తారని ఆర్ధిక మంత్రి వివరించారు.
బ్యాంకింగ్, ఈక్విటీ, లోన్లు​ వంటి ఆర్థిక సేవలు అందరికీ అందితేనే  సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.   సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమ్మిళిత వృద్ధి ఫలాలు అందాలని ఆమె చెప్పారు. ఖాతాదారుల సమ్మతి ఆధారిత బ్యాంకు ఖాతాలను ఆధార్, ఖాతాదారుల మొబైల్ నంబర్‌లతో లింక్ చేయడం ద్వారా రూపొందించిన జెఎఎం (జన్ ధన్-ఆధార్-మొబైల్) పైప్‌లైన్ ఆర్థిక చేరిక పర్యావరణ వ్యవస్థ ముఖ్యమైన స్తంభాలలో ఒకటి అని కూడా ఆమె చెప్పారు.

ఆర్థిక సమ్మేళనం తమ ప్రభుత్వంకు అత్యంత ప్రాధాన్యతలలో ఒకటి అని ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పష్టం చేశారు. పేదలకు వారి పొదుపులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి ఇది ఒక మార్గాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా వారి కుటుంబాలకు డబ్బును పంపించే మార్గాన్ని అందిస్తుందని, వడ్డీ వ్యాపారుల బారి నుంచి వారిని బయటకు తీయడం జరుగుతుందని వివరించారు.