ఆలయాల స్వాధీనంపై తమిళనాడుకు `సుప్రీం’ నోటీసు 

దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు )నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సవాలు చేశారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపి.. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 
 
బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడంపై కూడా స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి.
చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే ఇప్పటి వరకూ దేవాదాయ శాఖ జోక్యం చేసుకోలేదు. అయితే దేవాలయాల అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యవహారమంతా చినికి చినికి గాలివానగా మారడంతో సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో దేవాలయాల స్వాధీనంపై పిటిషన్ వేశారు.
తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగానే.. ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్లను ఆలయ అర్చుకులుగా నియమిస్తామని మాటిచ్చారు ఆయన. ఈ మేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటిఏడాదిలో అగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హిందూ రెలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్‌ విభాగం.. సుమారు 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించింది.

ఈ మేరకు ‘‘స్టాలిన్‌.. ఆయన తండ్రిలాగా ఆలయాల విషయంలో తప్పులు చేయరనే అనుకుంటున్నా. స్టాలిన్‌ 2014లో సభనాయాగర్‌ నటరాజ్‌ ఆలయ విషయంలో సుప్రీం కోర్టు నుంచి చివాట్లు తిన్న విషయం మరిచిపోయారేమో!. ఇప్పుడు ఆలయాల అర్చకుల విషయంలో తప్పు చేస్తుంటే ఊరుకోను. కోర్టుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్తానంటూ కిందటి ఏడాది ఆగస్టులో స్వామి ఓ ట్వీట్‌ కూడా చేశారు.

హిందూ దేవాలయాలపై కమ్యూనిస్టు ప్రభుత్వాలు

ఇలా ఉండగా, హిందూ దేవాలయాలకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయం కోసం హిందూ దేవాలయాలను కమ్యూనిస్టు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ అంశంపై 2020లో ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం తీసుకున్న నిర్ణయం గురించి ఆమె ప్రస్తావిస్తూ ఆదాయం కోసమే హిందూ దేవాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. 

‘‘ఆదాయం కోసమే కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు కాబట్టి నేను, జస్టిస్ లలిత్ అనుమతించలేదు’’ అని జస్టిస్ ఇందూ చెప్పారు. దీంతో మీ గురించి గర్వంగా భావిస్తున్నామని ఒక మహిళ వ్యాఖ్యానించడం, దానికి రిటైర్డ్ జడ్జి ఆ మహిళకు కృతజ్ఞతలు చెప్పడం వీడియోలో చూడవచ్చు.