మునావర్ ఫారూఖీ షోకి ఢిల్లీ పోలీసుల అడ్డు 

వివాదాస్పద మునావర్ ఫారూఖీ షోనిర్వహణకు జాతీయ రాజధాని ఢిల్లీలో పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఢిల్లీలో ఈ నెల28వతేదీన నిర్వహించ తలపెట్టిన కామెడీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. మునావర్ కామెడీ షో వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, అందువల్ల తాము అనుమతి నిరాకరిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పడంతో ఆగస్టు 28న మునావర్ ఫరూఖీ ఢిల్లీ షో రద్దయింది. 
 
మునావర్ ఫారూఖీ తన షోలో హిందూ దేవుళ్లను అవహేళన చేశాడని, హైదరాబాద్ ఘర్షణకు ఆయనే కారణమని వీహెచ్‌పీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. వీహెచ్‌పీ ఢిల్లీ అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గుప్తా మునావర్ షోపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని- ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
ఢిల్లీలోని కేదార్ నాథ్ సాహ్నీ ఆడిటోరియంలో ఆగస్టు 28వ తేదీన మునావర్ షో నిర్వహించాలని నిర్వాహకులు ప్రతిపాదించడంతో ముందు అనుమతించారు. అనంతరం హైదరాబాద్ ఘర్షణకు కారణమైన మునావర్ ఫారూఖీ షో కు అనుమతి రద్దు చేయాలని అభ్యర్థిస్తూ విశ్వహిందూ పరిషత్ నాయకుడు ఢిల్లీ పోలీసు కమిషనరుకు లేఖ వ్రాసారు.
 ప్రదర్శన జరిగితే తాము నిరసన తెలుపుతామని వీహెచ్‌పీ హెచ్చరించింది.  2021వ సంవత్సరంలో అరెస్టయినప్పటి నుంచి మునావర్ ప్రదర్శనలు పోలీసులకు శాంతిభద్రతల సమస్యగా మారాయి.  గత వారం, మునావర్ బెంగుళూరు షో రద్దు అయింది.
తన అనారోగ్యం వల్ల షో రద్దు చేశామని చెప్పిన మునావర్ ఆ తర్వాత భారీ భద్రత మధ్య హైదరాబాద్ నగరంలో కామెడీ షో నిర్వహించారు. ఈ షో అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  వివాదాస్పద వీడియో విడుదల చేయడం, అతన్ని అరెస్టు చేయడం, దీంతో ఘర్షణకు దారి తీసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.