కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరించడం అప్రజాస్వామికం

ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం ప్రజాస్వామ్యస్పూర్తికి విరుద్ధం, తెలంగాణ ప్రజలకు నష్టదాయకమే తప్ప ఆ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా ఒనగూరేదేమీ ఉండదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి కె అరుణ స్పష్టం చేశారు. 
ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ముఖం లేకే సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్లకుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమ ర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో ఏనాడు కేంద్రంలో అధికారిక మీటింగ్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపని కేసీఆర్, తన రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ పార్టీలతో సమావేశాల కోసమో.. లేదంటే డాక్టర్ల వద్ద చికిత్స కోసమో మాత్రమే ఢిల్లీ వెళ్లారని  ఆరోపించారు.
 
గతంలో ప్లానింగ్ కమిషన్ ఎదుట ముఖ్యమంత్రులు గంటల తరబడి చేతులు కట్టుకుని వినడమే తప్ప చేసేదేమీ లేని పరిస్థితి ఉండేదని అరుణ గుర్తు చేశారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి అయోగ్ ఏర్పాటు ద్వారా అనేక అంశాలను ప్రస్తావించే అవకాశాన్ని, అభిప్రాయాలను వెలుబుచ్చే వెసులుబాటును కల్పించి ముఖ్యమంత్రుల గౌరవాన్ని పెంచి టీం ఇండియా స్పూర్తిని చాటిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఆమె కొనియాడారు. 
 
 అలాంటి వ్యక్తిపై రాజకీయ లబ్ది కోసం అవాకులు చవాకులు పేలడం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనం అంటూ అరుణ మండిపడ్డారు.  నిరర్ధక ఆస్తులకు, ఉద్దీపన ఆస్తులకు తేడా ఉందనే కనీస సోయి లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.
2004 నుండి 2014 వరకు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు అవసరం లేని వ్యక్తులకు, సంస్థలకు బ్యాంకులకు ఎడాపెడా రుణాలిప్పించడంవల్లే అవన్నీ నేడు నిరర్ధక ఆస్తులుగా మారాయనే విషయాన్ని విస్మరించారని ఆమె హితవు చెప్పారు. నిజంగా కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే ఈ అంశంపై చర్చకు సిద్ధం కావాలని ఆమె సవాల్ చేశారు.
 
విదేశీ మారక ద్రవ్యం నిల్వల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.  గతంలో 200 బిలియన్ డాలర్లున్న విదేశీ మారక ద్రవ్యం నిల్వలను నేడు 640 బిలియన్ డాలర్లకు చేర్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అని ఆమె గుర్తు చేశారు. 
విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో భారత్ నాలుగో అతిపెద్ద దేశం అని, అమెరికా, చైనా, జపాన్ తరువాత అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలున్న దేశం భారత్ అనే వాస్తవాలను కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఆమె తెలిపారు.
 
విదేశీ ఎగుమతులు, దిగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సమతుల్యత సాధిస్తోందని అరుణ చెప్పారు.  అయినప్పటికీ కేసీఆర్ నిత్యం శ్రీలంక, చైనా దేశాల జపం చేయడం వెనుక మర్మమేమిటో ఆయనకే తెలియాల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలను సైతం తెలంగాణలో పూర్తిస్థాయిలో తయారు చేయించలేక సూరత్ నుండి దిగుమతి చేసుకునే కేసీఆర్ విదేశీ దిగుమతులపై మాట్లాడటం హాస్యాస్పదం అని ఆమె మండిపడ్డారు. 
 
పప్పుదినుసుల ఉత్పత్తిలో భారత్ స్వయం సమ్రుద్ధి సాధించినప్పటికీ కేసీఆర్ మాత్రం అబద్దాలు చెప్పడం సిగ్గు చేటని అరుణ విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పప్పు దినుసులు పండిస్తున్న రైతులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించకుండా కేంద్రంపై విమర్శలు చేయడం విడ్డూరమని ఆమె దుయ్యబట్టారు.  ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్దాలు, అర్ధ సత్యాలే అని ఆమె స్పష్టం చేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంపై బురద చల్లి రాజకీయ లబ్ది పొందేందుకు చేసిన కుట్రగానే భావిస్తున్నామని అరుణ చెప్పారు. ఆయన లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆమె సవాల్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఈ విషయంలో వాస్తవాలు వివరిస్తాం…ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ బండారాన్ని బయటపెడతామని ఆమె వెల్లడించారు.