చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే అవకాశం

చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హొర్ముజ్‌ జలసంధిపై నావికా దిగ్బంధానికి ఆదేశించడంతో పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరితగతిన ముగింపు లభించగలదన్న ఆశలు సన్నగిల్లాయి. ఇరాన్‌తో ప్రతిష్టంభన కారణంగా ఇప్పటికే చరిత్రలోనే అ్యతంత తీవ్రమైన ఇంధన సంక్షోభం ఏర్పడింది.  ట్రంప్‌ గత వారం ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటనతో హొర్ముజ్‌ జలసంధి గుండా స్వల్పంగా పెరిగిన ట్యాంకర్‌ ట్రాఫిక్‌ ట్రంప్‌ తాజా ప్రకటనతో మళ్లీ నిలిచిపోయినట్లు లాయిడ్స్‌ లిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ తెలిపింది. 
 
జలసంధి గుండా వెలుపలకు నిష్క్రమించడానికి వెళుతున్న రెండు నౌకలు మళ్లీ వెనుదిరిగినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్‌ ముడిచమురు 7 శాతం పెరిగి 101.86 డాలర్లకు చేరింది.  పూర్తి దిగ్బంధం వల్ల సంక్షోభం మరింత ముదురుతుంది.  ఇప్పుడు పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి బయటకు వస్తున్న ఏకైక చమురును మార్కెట్‌ నుంచి తొలగిస్తే చమురు ధర బ్యారెల్‌కు సుమారు 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని రెస్పాన్సిబుల్‌ స్టేట్‌క్రాఫ్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రీటా పార్సీ తెలిపారు. 
 
ముడిచమురుతోపాటు ఆహార ఉత్పత్తి, సెమీకండక్టర్‌ తయారీకి కీలకమైన ముడి పదార్థాలైన ఎరువులు, హీలియం వంటి వస్తువుల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని ఫెడ్‌ వాచ్‌ అడ్వైజర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బెన్‌ ఎమోన్స్‌ తెలిపారు.  ఈ యుద్ధానికి పరిష్కారం లభించినప్పటికీ పేరుకుపోయిన ఆర్డర్లను పూర్తి చేయడానికి వారాలు పట్టవచ్చని నిపుణులు హెచ్చరించారు. 

ఈ దిగ్బంధం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కూడా ఈ యుద్ధంలోకి లాగే ప్రమాదం ఉంది. చైనా ఇప్పటికీ ఇరాన్‌కు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలసంధి ద్వారా రవాణాను స్వీకరిస్తూనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్‌ నుంచి చమురును తీసుకువెళ్లే ట్యాంకర్లపై పూర్తిస్థాయి నిషేధం ఆ సరఫరాను నిలిపివేసే ప్రమాదం ఉంది. 

ఇది వచ్చే నెలలో ట్రంప్‌ చైనా పర్యటనకు ముందు బీజింగ్‌తో అమెరికా ఉద్రిక్తతలను మళ్లీ రాజేసే అవకాశం ఉంది. ట్రంప్‌ మళ్లీ ఉద్రిక్తతల పెంపునకు సిద్ధపడతారా? అన్నది అనుమానాస్పదమేనని పార్సీ చెప్పారు. ఇరాన్‌తో సురక్షిత మార్గాల ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్‌, పాకిస్థాన్‌ వంటి దేశాలు కూడా ఈ ఘర్షణలో చిక్కుకునే ప్రమాదం ఉంది.  అయితే ఈ దిగ్బంధాన్ని పరిస్థితిని తీవ్రతరం చేసే అంతిమ చర్యగా కాకుండా ఒక బలవంతపు ఒత్తిడిగా విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలు మళ్లీ ప్రారంభం కావని లేదా కాల్పుల విరమణ ముగిసిందని ఇరుపక్షాలు స్పష్టంగా చెప్పనందున ఈ చర్యలన్నిటినీ చర్చల్లోని ఎత్తుగడలు, బెదిరింపులుగానే పరిగణించాలని చెబుతున్నారు.