పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆత్మాహుతి దాడిలో 14 మంది మృతి

పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆత్మాహుతి దాడిలో 14 మంది మృతి
వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఒక పోలీస్ స్టేషన్ సమీపంలో శాంతి ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ఐదుగురు పోలీసు సిబ్బందితో సహా కనీసం 14 మంది మరణించారని, ఈ దాడిలో మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు.స్వాత్ జిల్లాలోని కబల్ పట్టణంలో స్వాత్ శాంతి ర్యాలీ జరుగుతున్న సమయంలో, దాడి చేసిన వ్యక్తి తన పేలుడు పదార్థాల జాకెట్‌ను పేల్చడంతో ఈ పేలుడు సంభవించింది. 
 
దీంతో స్థానికులలో భయాందోళనలు చెలరేగి గందరగోళం నెలకొంది. వెంటనే, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా దిగ్బంధించారు, మరియు దర్యాప్తు కొనసాగుతోంది. “దాడి చేసిన వ్యక్తి… తన పేలుడు పదార్థాల జాకెట్‌ను పేల్చడంతో, ఐదుగురు పోలీసు అధికారులతో సహా 14 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు,” అని స్వాత్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఫిదా హుస్సేన్ తెలిపారు.
 
“ఒక ఆత్మాహుతి బాంబర్ కూడలిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు, కానీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అతడిని అడ్డుకున్నారు.” ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం, స్వాత్ అమాన్ జిర్గా (స్థానిక గిరిజన మండలి) ఈ ర్యాలీని నిర్వహించింది. లక్షిత దాడులు, ఆత్మాహుతి దాడులతో తీవ్రంగా ప్రభావితమైన ఈ ప్రాంతంలో శాంతిని కోరుతూ దాని మద్దతుదారులు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. 
 
ఇప్పటివరకు ఏ గ్రూపు కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. కానీ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఈ ఆత్మాహుతి దాడిని జరిపిందని అనుమానిస్తున్నారు. ఒక పాకిస్థాన్ సైనిక అధికారి ప్రకారం, ఈ మిలిటెంట్ల కారణంగా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో 819 మంది భద్రతా సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
టీటీపీ కారణంగా, పాకిస్థాన్, పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాబూల్ మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపించింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.  అయినప్పటికీ, పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్‌లో టీటీపీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అనేక వైమానిక దాడులు నిర్వహించింది.  ప్రతీకారంగా, ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్‌పై దాడులు చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని కోరింది.