రైల్వే భూమి లైసెన్స్ ఫీజు భారీగా తగ్గింపు

రైల్వే భూముల విధానాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం రైల్వే భూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించి, కౌలు కాలాన్ని కూడా ఐదేళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

రానున్న ఐదేళ్లలో 300 కు పైగా గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాలని, రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీ ను 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. లీజు కాలాన్ని ఐదేళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచేందుకు ఆమోదించారు. నూతన విధానం వల్ల కొత్తగా దాదాపు 1.2 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

మరోవైపు రైల్వేలు కూడా మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతాయని భావిస్తున్నారు. భూమి లీజు కాలాన్ని పెంచడం వల్ల మరిన్ని కార్గో టెర్మినల్స్ నిర్మాణానికి, ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అవకాశం కలుగుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. 

కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ మరింత ఆకర్షణీయం అవుతుందని భావిస్తున్నారు. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని యాజమాన్య నియంత్రణను బదిలీ చేయాలని 2019 నవంబరులో కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 30.8 శాతం వాటాలు ఉన్నాయి. ఈ వాటాల అమ్మకం ద్వారా రూ.8000 కోట్లు సంపాదించాలని ప్రభుతం లక్ష్యంగా పెట్టుకుంది.