జేపీ నడ్డాతో మిథాలీ రాజ్ భేటీ

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారత మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో శనివారం భేటీ అయ్యారు.  మిథాలీ నడ్డాకు పుష్పగుచ్ఛం అందించి అభివాదం తెలిపారు. నడ్డా కూడా మిథాలీకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇరువురి మధ్య చర్చ జరిగింది. 
 
ఈ భేటీ రాజకీయ సంబంధమైనదా? లేక, మర్యాదపూర్వకంగా జరిగినదా? అనేదానిపై స్పష్టత లేదు. మిథాలీ ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. 
 
అటు, టాలీవుడ్ హీరో నితిన్ కూడా నేడు జేపీ నడ్డాను కలవనున్నారు. నోవాటెల్ హోటల్ లో వీరి భేటీ సాయంత్రం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కొద్దీ రోజుల క్రితమే ప్రముఖ దర్శకుడు, రచయిత విజయేంద్ర ప్రసాద్ ను బిజెపి రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే.
 
 ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా టాలీవుడ్ అగ్ర కథనాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి, విందు చేశారు.  వీరిద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయన్నది ఇప్పటికీ వెల్లడి కాలేదు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి రావాలని పట్టుదలగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి పార్టీ ప్రచారంకు, పోటీ చేయడానికి బలమైన నాయకులు లేరని గుర్తించింది. 
 
అందుకనే ఇతర పార్టీల నుండి నియోజకవర్గాలలో బలమైన  నాయకులను ఒక వంక పార్టీలోకి ఆకర్షిస్తూ, మరోవంక వివిధ రంగాలలో ప్రముఖులను పార్టీ వైపు ఆకట్టుకొనే ప్రయత్నాలు  చేస్తున్నట్లు కనిపిస్తున్నది. 
మరోవైపు..బండి సంజయ్ ప్రజాసంగ్రామ యంత్రం మూడోవిడత పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చేరుకున్నారు. అక్కడ  నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తరుణ్ చుగ్, పలువురు బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. 
 
మధ్యాహ్నం 3.20 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌ చేరుకున్న జేపీ నడ్డా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట కేంద్ర​ మంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, తరుణ్‌ చుగ్‌ ఉన్నారు. అనంతరం 3.45 నిమిషాలకు ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ వెంకటనారాయణ ఇంటికి వెళ్లారు.