వరంగల్ లో ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్ లో ముగిసింది. భద్రకాళి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్‌ చేరుకున్నారు. 22 రోజుల పాటు అయిదు జిల్లాల్లో పాదయాత్ర సాగింది. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300కు పైగా కిలోమీటర్లు నడించారు బండి సంజయ్. ఉత్కంఠ ఉద్రిక్తతల మధ్య మూడో విడత పాదయాత్ర ముగిసింది. చివరి రోజున 14 కిమీ మేరకు నడిచారు. 
 
వరంగల్ ఆర్డీఓ ఆఫీస్ చౌరస్తా వరకు చేరుకున్నప్పుడు పులా వర్షం కురిపిస్తూ బిజెపి కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ సంజయ్ ముందుకు సాగారు. 3 విడతల్లో మొత్తం 1121 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 18 జిల్లాల్లోని 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. 
 
 పాదయాత్రలో బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ కలిసి సంఘీభావం తెలిపారు. 30 మంది ఎన్ఆర్ఐ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఉదయం మామునూరు నుంచి మొదలైన పాదయాత్ర తిమ్మాపూర్ క్రాస్ రోడ్, నాయుడు పంప్ చౌరస్తా, రంగశాయిపేట, గవిచర్ల క్రాస్ రోడ్, శంభునిపేట, మిల్స్ బజార్ మీదుగా ఎంజీఎం జంక్షన్ చేరుకుంది.
 
జనగామ జిల్లా పాంనూర్‌ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి శుక్రవారం మొదలైంది.
వరంగల్ చేరుకున్నాక ఉద్రిక్తత 
 అంతకుముందు సంజయ్ వరంగల్ కు చేరుకున్న అనంతరం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బట్టల బజార్ కు చేరుకున్న బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ కు స్వాగతం పలికేందుకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. 
 
ఈ సమయంలో అక్కడే ఉన్న వరంగల్ ఏసీపీ గిరికుమార్  ప్రదీప్ రావును అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రదీప్ రావును పక్కకు తోసేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తమ నేతలకు స్వాగతం పలికేందుకు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రదీప్ రావు ఏసీపీ గిరికుమార్ ను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న సంజయ్ పోలీసుల తీరును తప్పుపట్టారు.  వరంగల్ కు చేరుకున్న పాదయాత్రలో శుక్రవారం రాత్రి నుంచే ఉద్రిక్తత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నిర్వహించిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.