హనుమకొండలో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

హనుమకొండలో బీజేపీ శనివారం సాయంత్రం జరుపతలపెట్టిన బహిరంగ  సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి  ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.
అయితే సభకు పోలీసుల అనుమతి లేదన్న కారణంతో కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి రద్దు చేశారు. దీంతో బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.బహిరంగ సభకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్నారు.
శనివారం ఆర్ట్స్ కాలేజీలో పరీక్షలు ఉన్నందునే ప్రిన్సిపల్ సభ అనుమతి రద్దు చేశారని ఏజీ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కళాశాలకు ఒకటే ప్రవేశం  ఉందని, సభ వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బీజేపీ సభకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో యధావిధిగా జరగనుంది. ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. 
 
మరోవైపు వరంగల్ కమిషనరేట్ పరిధిలో నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి  ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. నగరంలో శుక్రవారం నుంచి 30 – సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ తరుణ్ జోషి ఉత్తర్వులిచ్చారు. 
 
శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. పోలీసు ఆంక్షలు ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు అమల్లోఉంటాయి. ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బీజేపీ హైకోర్టు నుంచి సభకు పర్మిషన్ తెచ్చుకున్న సమయంలో  పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది.
ఇలా ఉండగా, బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చినహైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తరుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలవుతోంది.
కాగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జ్ సునీల్ బన్సల్ తొలిసారి తెలంగాణలో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా హనుమకొండకు వెళ్తారు. అనంతరం రేపు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న సభాస్థలికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా సునీల్‌ బన్సల్‌ ఇటీవలే నియమితులయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ వెంటనే తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాల ఇన్‌ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పగించారు.