ఇప్పుడు, హనుమకొండలో నడ్డా బహిరంగ సభకు మోకాలడ్డు!

తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొదటిసారిగా ఓ ఎమ్యెల్యే ను (రాజాసింగ్) పిడి చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపి ప్రసిద్ధి కావించిన కేసీఆర్ ప్రభుత్వం తొలుత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేబడుతున్న ప్రజాసంగ్రామ యాత్రకు అర్ధాంతరంగా అనుమతి రద్దు చేసి, మధ్యలో అడ్డుకోంది. దానితో మూడు రోజుల పాటు పాదయాత్రకు అంతరాయం ఏర్పడింది. 

బీజేపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో పోలీస్ చర్యను సవాల్ చేసి, అనుమతి పొంది శుక్రవారం నుండి యాత్రను కొనసాగిస్తుండగా, శనివారం యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుపతలపెట్టిన బహిరంగసభకు చివరిక్షణంలో అనుమతి ఇవ్వడం లేదని గురువారం రాత్రి తెలిపారు. 

హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు పోలీసుల నుండి తగు అనుమతి రాకపోవడంతో ఈ సభకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆ మేరకు గురువారం సాయంత్రం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మారెడ్డికి లేఖ రాశారు. సభ కోసం బీజేపీ చెల్లించిన రూ.5 లక్షలను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. 

మరోవంక, మూడు రోజుల క్రితం పాదయాత్రను ఆపిన చోట నుండే సంజయ్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పామునూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంచించారు. 

స్టేషన్ ఘనపురం నియోజకవర్గం, ఉప్పుగల్ సమీపంలోని పాదయాత్ర శిబిరం నుంచి ప్రారంభించారు. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు కొనసాజి, రాత్రికి  నాగాపురం సమీపంలో  బస చేస్తారు.  కాకపోతే పాదయాత్ర రూట్ మ్యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. శనివారం ఉదయం వరంగల్ భద్రకాళి గుడిలో అమ్మవారిని సంజయ్ దర్శించుకోనున్నారు.

 కాగా, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాము చేస్తున్న “ప్రజా సంగ్రామ యాత్ర”ను 8వ నిజాం కేసిఆర్ అడ్డుకున్నాడని అంటూ యాత్ర ప్రారంభం సందర్భంగా సంజయ్ మండిపడ్డారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తున్నామని చెబుతూ కోర్టు తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టని దుయ్యబట్టారు.
 
నిజాం నవాబునే తరిమి కొట్టిన వీరులగడ్డ, మన తెలంగాణ గడ్డ అని కెసిఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తమ బిజెపి కార్యకర్తల్లోనూ అలాంటి వీరులే ఆవహించారని తెలిపారు.  ప్రజా సమస్యలను తెలుసుకునే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. 
ఇప్పుడు బహిరంగ సభను కూడా అడ్డుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ సభను జరిపి తీరుతామని సంజయ్ స్పష్టం చేశారు.  బహిరంగ సభకు ముందే అనుమతి తీసుకున్నామని చెబుతూ అయినా అనుమతి లేదని అనడం  కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. 
 
కోర్టు అనుమతితో బహిరంగ సభను నిర్వహించి తీరుతామని సంజయ్ భరోసా వ్యక్తం చేశారు. మునావర్ ఫారుఖీని హైదరాబాద్ కు  తీసుకురావడం, ఆ తర్వాత పాదయాత్రను అడ్డుకోవడం,  తనను  గృహనిర్బంధం చేయడం, మత ఘర్షణలు సృష్టించడం, ఇప్పుడు బహిరంగ సభను అడ్డుకోవాలని చూడడం… అన్నీ కూడా లిక్కర్ మాఫియా లో కవిత ప్రమేయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అని సంజయ్ ఆరోపించారు. 
 
పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేస్తూ  తన కుటుంబం మీద వస్తున్న ఆరోపణలను డైవర్ట్ చేసేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మునావర్ ఫారుఖీని ఆహ్వానించి రెచ్చగొట్టిందెవరని ప్రశ్నించారు.