కాంగ్రెస్ కు గులామ్‌ నబీ ఆజాద్‌ రాజీనామా

ఒక వంక పార్టీ అధ్యక్ష ఎన్నిక జరపలేక పార్టీ నాయకత్వం సతమతమవుతూ ఉండగా, మరో వంక ఒకొక్క నాయకుడు పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. తాజాగా, పార్టీ సీనియర్ నేత,  రాజ్యసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు గులామ్‌ నబీ ఆజాద్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా, పలు పర్యాయాలు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 

యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి, కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా, ఏఐసీసీ  సభ్యునిగా, పలు రాష్ట్రాల ఇన్ ఛార్జ్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

కాంగ్రెస్ తో అర్ధ శతాబ్ద కాలంగా సంబంధాలున్నాయన్న  ఆజాద్  కాంగ్రెస్ తో సంబంధం బరువెక్కిన హృదయంతో తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సోనియా గాంధీకి  రాసిన ఐదు పేజీల లేఖలో తెలిపారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటుసేవలందించిన సీనియర్ నేతలను పక్కన పెట్టడంపై తీవ్ర మనస్థాపం చెందానని లేఖలో పేర్కొన్నారు. 

రాహుల్ గాంధీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. `భారత్ జోడో యాత్ర’ ప్రారంభించే ముందు `కాంగ్రెస్ జోడో యాత్ర’ ప్రారంభించి ఉండవలసింది అంటూ ఆయన ఆమెకు హితవు చెప్పారు. 1981లో సంజయ్ గాంధీ మొదటి వర్ధంతి సందర్భంగా మీ భర్త రాజీవ్ గాంధీని యువజన కాంగ్రెస్ జాతీయ మండలిలోకి అధ్యక్షునిగా తానే చేర్చుకొన్నానని ఈ సందర్భంగా ఆమెకు గుర్తు చేశారు. 

రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన లేదని పేర్కొంటూ కాంగ్రెస్ రాజకీయ పలుకుబడి క్షీణించడం, పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో పేలవమైన పనితీరుకు రాహుల్ గాంధీ అపరిపక్వత కారణమని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీకి వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాకే పార్టీ నాశనమైందని విమర్శలు గుప్పించారు.

సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ  సీనియర్లు అందరిని రాహుల్‌ పక్కన పెట్టేశారంటూ మండిపడ్డారు. ఏఐసీసీ భజనపరులతో నిండిపోవడంతో భారత దేశం కోసం పోరాడే ఆసక్తిని, సామర్ధ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని ఆజాద్  తీవ్ర స్వరంతో స్పష్టం చేశారు.

ఆగష్టు 16న  ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసు, కోగాక్రితమే ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు.

అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవి కాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  కాగా, బీజేపీ మాత్రం ఆజాద్‌కు అరుదైన గౌవరం ఇచ్చింది. ఈ ఏడాది పద్మభూషణ్‌ ఇచ్చి గౌరవించింది.