ప్రజలు త్వరలోనే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారు

 
‘‘తెలంగాణను నయా నిజాం దోచేస్తున్నారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారు. ప్రజలు త్వరలోనే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారు” అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 
 
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో  జరిగిన బహిరంగసభలో పాల్గొంటూ   టీఆర్‌ఎస్  పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని మండిపడుతూ  మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని వరంగల్ జైలును కూల్చారని విమర్శించారు.  ఇన్ని రోజులైనా ఆస్పత్రి నిర్మాణం జరగలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు.  
 
జల్‌ జీవన్‌ మిషన్  కింద తెలంగాణకు కేంద్రం రూ 3,500 కోట్లు కేటాస్తే తెలంగాణ ప్రభుత్వం రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు.  ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని పేర్కొంటూ  అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌లో భయం మొదలైందని నడ్డా స్పష్టం చేశారు. 
 
 తెలంగాణను చీకటి నుంచి బయటపడేసేందుకే సంజయ్ పాదయాత్ర చేపట్టారని చెబుతూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను సాగనంపడమే పాదయాత్ర ఉద్దేశమని తెలిపారు. బీజేపీ సభకు అడుగడుగునా ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. 144 సెక్షన్ బూచి చూపి జనం రాకుండా అడ్డుకున్నారని. హైకోర్టు అనుమతితో సభ నిర్వహించుకుంటున్నామని జేపీ నడ్డా తెలిపారు. 
 
కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు కూడా పాకిందని చెబుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ధ్వజమెత్తారు. రూ.40వేల కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలు పెట్టిన కేసీఆర్ సర్కారు.. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.లక్ష 40 వేల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. 
 
తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారని చెబుతూ నిజాం తరహాలోనే ప్రజలు కేసీఆర్ ను రాబోయే రోజుల్లో ఇంట్లో కూర్చోబెడుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ఇదే ముగింపు అని చెప్పారు.
 
రాష్ట్రంలో 12 జిల్లాల్లో వరదలు వస్తే కేంద్రం రూ.377 కోట్లు ఇస్తే..ఆ నిధులను సీఎం కేసీఆర్ ప్రజలకు ఇవ్వలేదని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు చాలా రకాలుగా నిధులు కేటాయించినా..వాటిని కేసీఆర్ డైవర్ట్ చేసి కేంద్రంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు.
కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.  వరంగల్  అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన  హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జగిత్యాల- వరంగల్‌ రోడ్డు కోసం కేంద్రం రూ.4,321 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.
 ‘‘వరంగల్ – ఖమ్మం రోడ్డు కోసం రూ. 3,364 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ. 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చాం. రామప్ప ఆలయ అభివృద్ధి కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వెయ్యి స్తంభాల ఆలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాం.’’ అని కిషన్ రెడ్డి వివరించారు. .
‘‘కాళేశ్వరానికి కేంద్రం వేల కోట్ల నిధులు ఇచ్చింది. వరంగల్‌లో స్మార్ట్‌ సిటీ కోసం కేంద్రం రూ. 196 కోట్లు ఖర్చు చేశాం. వరంగల్‌ జిల్లాలో సైనిక స్కూల్ రాబోతుంది.  రూ.8,200 కోట్లతో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తాం.  వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాం” అని ప్రకటించారు.
1300 కి.మీ. రైల్వే లైన్‌ కోసం రాష్ట్ర సర్కార్ భూమి కేటాయించలేదనిరి విమర్శించారు.  కేంద్ర  టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని, కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలని పిలుపిచ్చారు.