నడ్డా సమక్షంలో బిజెపిలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గురువారం బీజేపీలో చేరారు. ఆయనకు బిజెపి కండువా కప్పి పార్టీలోకి నడ్డా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ బలంగా ఉందని, అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉందని చెప్పారు. ప్రదీప్ రావు వెంట బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్  తరుణ్ చుగ్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు కూడా ఉన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగనంద్ కొల్లూరు కూడా బీజేపీలో చేరారు. 
 
ప్రదీప్‌రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సోదరుడు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో ఏర్పడిన విభేదాలతో పాటు, తన సోదరుడు దయాకర్‌రావు మంత్రివర్గంలో ఉండడంతో తనకు రావాల్సిన పదవులు రావడం లేదనే భావనలో ఉన్నట్టు తెలిసింది. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావించారు. అయితే ఆ స్థానం నుంచి నన్నపునేని నరేందర్‌‌ను బరిలోకి దింపారు. ఆ టికెట్‌ దక్కించుకున్న నరేందర్‌ ఎన్నికల్లో గెలిచారు. 
 
అప్పుడే ప్రదీప్‌రావు అసంతృప్తి తెలపడంతో ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీతో టిఆర్‌ఎస్‌ బుజ్జగించింది. టిఆర్‌ఎస్‌లో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బృందం ప్రదీప్‌రావుతో పలు దఫాలుగా చర్చలు జరిపి పార్టీలో చేరికకు లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలిసింది.