సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ఆపాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది. బుధవారం బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల ఉత్తరువులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్  మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ దీక్షకు దిగారు. అయితే దీక్షను భగ్నం చేసిన పోలీసులు సంజయ్ ను వెంటనే పాదయాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు ఇచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బండి పాదయాత్ర చేపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసు నోటీసులను సవాల్ చేస్తూ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.  లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్రకు ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో మూడు రోజుల అంతరాయం అనంతరం బండి సంజయ్ పాదయాత్రకు తిరిగి సిద్ధమయ్యారు. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రికి ఎక్కడికి చేరుకోవాల అక్కడి నుండి శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.   జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్ర చేపట్టేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు ఆయన రాత్రికి పాంనూర్ చేరుకోనున్నారు. రెండు రోజులుగా నిలిచిన దూరాన్ని శుక్రవారం నుంచి ఆయన కవర్ చేయనున్నారు.
ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం హనుమకొండలో భారీ బహిరంగ సభ జరిపేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఈ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు.