ఎమ్యెల్యే రాజాసింగ్‌ పీడీ యాక్ట్ పై అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ను ప్రయోగిస్తూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇప్పటికే రాజాసింగ్‌కు పాత కేసుల్లో  41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులిచ్చారు. రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2004 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 101 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో గతంలో నమోదైన కేసులో రాజాసింగ్ పై రౌడీ షీట్ నమోదై ఉంది.

పదే పదే ఒకే తరహా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తారు. పీడీ యాక్ట్ నమోదైతే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ కింద ఏడాది పాటు జైలులోనే పెడతారు. ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత పీడీ యాక్ట్ జీవో తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ నమోదుచేసి నేరుగా జైలుకు తరలించే అధికారం పోలీసులకు ఉంటుంది.

దాన్ని సవాల్ చేయాలంటే పీడీ యాక్ట్ రివోక్ చేసేందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.  ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులకు సంబంధించి మంగళ్‌హాట్‌, షాహినాయత్‌గంజ్‌ పోలీసులు ఈ రోజు ఉదయమే రాజాసింగ్‌కు 41(ఎ) సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంగళ్‌హాట్‌ పోలీసులు కోరారు. రెండు రోజుల క్రితం మహ్మద్‌ ప్రవక్తపై, ఇస్లాం మతంపై రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం.. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండు విధించింది. బుధవారం కోర్ట్ ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయమని కోరుతూ పోలీసులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన కొట్టి సేపటికే ఈ అరెస్ట్ చేశారు.

అయితే పోలీసులు ఆయన అరెస్టులో నిబంధనలు పాటించలేదంటూ రాజాసింగ్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తేవడంతో న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు రాజాసింగ్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడం, నిరసనల సెగ ఢిల్లీ దాకా తాకడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడమే కాక సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం ఓ వీడియోతో అలజడి సృష్టించిన ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వీడియోను మీడియాకు పంపారు. హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితులకు మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్లే కారణమని మండిపడ్డారు. కేటీఆర్, అసద్లను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తనను పాత కేసుల్లో అరెస్టు చేయాలని చూస్తున్నారని, నగర బహిష్కరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారంటూ ఆ వీడియోలో అనుమానం వ్యక్తం చేశారు. వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు రాజాసింగ్ ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు బారీకేడ్లు వేశారు.

రాముడు, సీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సభ్యత్వం రద్దుపై అప్పట్లో ఎందుకు స్పీకర్కు ఫిర్యాదు చేయలేదు? అని వీడియోలో రాజాసింగ్ ప్రశ్నించారు. ‘‘నా శాసనసభ సభ్యత్వం రద్దు చేసినా పర్లేదు. ధర్మం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు.

అయితే, పోలీస్ వాహనాలను ధ్వంసం చేసిన వారిని.. తలలు నరకుతామన్న వారిపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. “నా వీడియోలో నేను ఎవరి దేవుడు పేరును ప్రస్తావించలేదు. చరిత్రను మాత్రమే చెప్పాను. మునావర్ షో వద్దని సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, కేటీఆర్కు చెప్పినా వినలేదు. ఈగోతో 5 వేల మంది పోలీసులతో కేటీఆర్ షో చేయించారు’’ అని వీడియోలో రాజాసింగ్ దుయ్యబట్టారు. తాను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని.. మహమ్మద్ ప్రవక్తపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.