ముగ్గురు వాయిసేన అధికారులపై వేటు

ఈ ఏడాది మార్చిలో బ్రహ్మోస్ క్షిపణి మిస్‌ఫైర్ అయిన ఘటనకు సంబంధించి ముగ్గురు భారత వైమానిక దళ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. గ్రూప్ కెప్టెన్‌తో పాటు ఇద్దరు వింగ్ కమాండర్లను విధుల నుంచి తప్పించింది. స్టాండింగ్ ఆపరేటర్ ప్రొసీజర్స్ పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీలో తేలడంతో విధుల నుంచి తప్పిస్తున్నామని తెలిపింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని  పేర్కొంది.

పంజాబ్‌లోని అంబాలా వాయిసేన స్థావరం నుంచి మార్చి 9న బ్రహ్మోస్ మిసైల్ ఒకటి ప్రమాదవశాత్తూ గాల్లోకి లేచి దూసుకుపోయింది. అది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పడింది. దీనిపై పాక్ తీవ్ర నిరసన వ్యక్తం చేయగా, భారత రక్షణ శాఖ విచారం వ్యక్తం చేసింది. కోర్ట్ అఫ్ ఎంక్వయిరీకి ఆదేశించింది.

 విచారణ అనంతరం ఎస్‌ఓపీ ఉల్లంఘనలు జరగడమే ఈ తప్పిదానికి కారణమని నివేదిక తేల్చింది. అందుకు ముగ్గురు అధికారులదే బాధ్యత అని స్పష్టం చేసింది. దీంతో నివేదక ఆధారంగా అధికారులను విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది.

బ్రహ్మోస్ మిసైల్ తమ భూభాగంపై పడినట్టు మార్చి 10న పాక్ నిరసన తెలిపింది. ఆ మరుసటి రోజే భారత రక్షణ శాఖ పొరపాటున ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రకటించింది. రొటీన్ మెయింటెన్స్ సమయంలో సాంకేతక లోపం తలెత్తిందని, ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా  తీసుకుంటుందని తెలిపింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం మార్చి 15న ఆపరేషన్స్, మెయింటనెన్స్, ఇన్‌స్పెక్షన్‌కు సంబంధించిన ఎస్ఓపీలను సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన అనంతరం, ఇస్లామాబాద్‌లోని భారత రాయబారికి పాకిస్థాన్ సమన్లు పంపి, తమ నిరసన తెలియజేసింది.  ఇండియాలోని సూరత్‌గఢ్ నుంచి ‘సూపర్ సోనిక్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్’ ఒకటి మియాన్ ఛాను సిటీలో పడి ఆస్తి నష్టం జరిగినట్టు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. దీనిపై నిష్పాక్షిక విచారణ జరపాలని, ఆ వివరాలను ఇస్లామాబాద్‌తో పంచుకోవాలని డిమాండ్ చేసింది.