100కు చేరిన టమాటో ఫ్లూ కేసులు… కేంద్రం అప్రమత్తం

దేశంలో టమాటో ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశాలో ఈ కేసులు వెలుగుచూశాయి. 100 మందికి పైగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.

* హ్యాండ్, ఫుట్‌, మౌత్ డీసీజ్‌ (హెచ్ఎఫ్‌ఎండీ) వ్యాధినే టమాటో ఫ్లూ అంటారు. ఇది 10 ఏళ్లలోపు చిన్నారులకు ఎక్కువగా వ్యాపిస్తుంది. పెద్దలకు కూడా వ్యాపించే అవకాశముంది.

* టమాటో ఫ్లూ వ్యాధి గురించి చిన్నారులకు అ‍వగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా వివరించాలని పేర్కొంది.
* టమాటో ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లలాగే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, అలసట, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.
* టమాటో ఫ్లూకు కరోనా, మంకీపాక్స్, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు.
* అపరిశుభ్ర ఉపరితలాన్ని తాకడం, పండ్లు, వస్తువులను శుభ్రం చేయకుండా నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి సోకవచ్చు.
* టమాటో ఫ్లూ సోకిన, లక్షణాలు కన్పించిన చిన్నారులను ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి.
* జ్వరం, దద్దుర్లు ఉన్న చిన్నారులు ఇతరులను తాకడం, కౌగిలించుకోవడం చేయవద్దని తల్లిదండ్రులు చెప్పాలి
* నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు దాన్ని మాన్పించాలి.
*ఎప్పుడూ వేడి నీటితోనే పిల్లలకు స్నానం చేయించాలి. పోషక పదార్థాలున్న ఆహారాన్నే ఇవ్వాలి.
*పిల్లలకు విశ్రాంతి, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.