వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలతో పొత్తు లేదు… తేల్చిన పవన్

అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ, టీడీపీలతో కలిసి ముందుకు వెళ్లడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలని తేల్చి చెప్పారు. 

జనసేనతో పొత్తు కుదిరినట్లే అని, జనసేన ద్వారా బిజెపితో కూడా సాధ్యం అని భరోసాతో ఉన్న టీడీపీ వర్గాలలో ఆయన మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో జనసేన , టీడీపీ కలిసి పనిచేస్తాయని, ఆలా పనిచేస్తే ఈజీ గా వైస్సార్సీపీ ని ఓడించవచ్చని అనుకున్నారు.

కానీ ఇప్పుడు పవన్ టీడీపీ తో కలిసేది లేదని తేల్చి చెప్పడం తో వారంతా దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. గతంలో వైస్సార్సీపీ పార్టీ ని ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని, పొత్తులకు తాము సిద్ధమని తెలిపిన పవన్ కళ్యాణ్ తాజాగా టీడీపీకి కొమ్ము కాయనని తేల్చి చెప్పారు.

కేంద్రం – రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కావాలని స్పష్టం చేసారు. అయితే తన ఎన్నికల వ్యూహం ఏమిటో వెల్లడించలేదు. ప్రజారాజ్యం ఉండి ఉంటే మూడో ప్రత్యామ్నాయంగా ఉండేదని పేర్కొంటూ ప్రజారాజ్యంలో నాడు ఉంటూ వైఎస్సార్ కోవర్టులుగా పని చేసిన వారు నేడు మంత్రులుగా ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైస్సార్సీపీ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉన్న కొంత మంది కోవర్టుల వల్లే తన అన్నయ్య, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నిలబెట్టుకోలేక పోయారని ఆయన వివరించారు. ప్రజారాజ్యం పార్టీ ఉంటే రాష్ట్రంలో కచ్చితంగా ప్రత్యామ్నాయం ఉండేదని పేర్కొన్నారు. తనను కూడా పార్టీలోకి రమ్మంటే రాను పొమ్మన్నానని పవన్ గుర్తు చేశారు.

ఏ ముఖ్యమంత్రులకు తాను భయపడనని చబుతూ ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పారు. తాను ఎవరికీ భయపడనని, తన ఆస్తులు లాక్కున్నా కూడా బలంగా నిలబడతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.