మరో పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు

సేవ్‌ అమరావతి, బిల్డ్‌ అమరావతి నినాదంతో మొదలైన అమరావతి ఉద్యమం 1,000 రోజులకు చేరుకుంటున్న తరుణంలో మరో పాదయాత్రకు రైతులు సిద్ధమవుతున్నారు. సెప్టెంబరు 12న ఈ యాత్రను ప్రారంభిస్తారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ పాదయాత్ర సాగుతుందని అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు కార్యాచరణ సమితి నేతలు ప్రకటించారు. 
 
ఇంతకుముందు నిర్వహించి న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రకు వివిధ ప్రాంతాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి నుంచి అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం వరకు పాదయాత్రను చేస్తామని పేర్కొన్నారు. దీనికి ప్రత్యేక యాప్‌ను రూపొందించామని వివరించారు. 
 
పాదయాత్రలో పాల్గొనే వారు ఎన్నిరోజులు పాల్గొంటారో తెలియజేస్తూ, వారి వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. వారికి అవసరమైన వసతి, భోజన సదుపాయాలు తాము కల్పిస్తామని వెల్లడించారు. 
 
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసిపి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపకపోతే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్‌ లేదని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు. అమరావతిని రాజధాని చేయాలని 975 రోజులకు పైబడి 29 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తుగ్లక్‌ చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 ఆరు నెలల్లో రాజధానిని అభివృద్ధి చేయాలని మార్చి 8న హైకోర్టు ఆదేశించినా ఇంతవరకు అతీగతి లేదని తెలిపారు. పైగా ఎంపిలతో అమరావతి ఇక్కడ ఉండదని, వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటనలు చేయిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా విభజించు, పాలించు పద్ధతిలో వ్యవహరిస్తోందని వివరించారు.
ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వలస పక్షుల మాదిరి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే వరకూ పాదయాత్ర సాగుతుందని వివరించారు. రాజధానిని అభివృద్ధి చేయండని కోర్టు చెబితే పిచ్చి మొక్కలు పీకి అదే అభివృద్ధి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.