నరసరావుపేట నుండి ప్రారంభమైన తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు

ఇకపై తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్త మార్గంలో గుంటూరు నుంచి రైలు కూత పెట్టింది. గుంటూరు నుండి ఉన్నత అధికారులు ప్రారంభించిన రైలు నరసరావుపేట చేరింది. నరసరావుపేటలో దీనిని ఉన్నతాధికారులు జండా ఊపి స్వాగతం పలికారు. దీంతో ఎన్నాళ్లుగానో గుంటూరు-  నంద్యాల మధ్యన ఇంటర్ సిటీ తరహాలో ఒక రైలుని ప్రవేశ పెట్టాలన్న ప్రయాణీకుల ఆకాంక్ష నెరవేరినట్లు అయింది. 
 
అంతేకాకుండా ప్రయాణికులకు సాయంత్రం వేళ నరసరావుపేట , వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు నూతనంగా రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పైగా తిరుపతికి వేకువజామున 4.25 గంటలకే ఈ రైలు చేరుకోనున్నందున తిరుమల చేరుకోవడానికి ఎంతో అనువైన సమయం అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
 
ఈ రైలు సాయంత్రం 4.30 గంటలకు గుంటూరులో బయలు దేరి 5.15 కి నరసరావుపేట, 5.44 కి వినుకొండ , రాత్రి 9.25 కి నంద్యాల , అర్ధరాత్రి 12.43 కి కడప, మరుసటి రోజు వేకువ జామున 4.25 కి తిరుపతి చేరుకొనేలా షెడ్యూల్ రూపొందించింది . దీనిపై గుంతకల్లు డివిజన్ అభ్యంతరం పెట్టినా దక్షిణ మధ్య రైల్వే ససేమిరా అని ప్రకటించిన సమయ పట్టిక ప్రకారమే నడపనున్నట్లు ప్రకటించింది. 
 
తిరుగు ప్రయాణం లోనూ నిత్యం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి 9.53 కి కడప, అర్ధరాత్రి దాటాక 1.40 కి నంద్యాల, మరుసటి రోజు వేకువజామున 5.09 కి వినుకొండ, 5.44 కి నరసరావుపేట, ఉదయం 8 గంటలకు గుంటూరు చేరుకుంటుంది . ఈ రైలు లో ఏసీ త్రీటైర్ -1 , స్లీపర్ -2 , జనరల్ -10 , బ్రేక్ వ్యాన్ -2 ఉంటాయి. దీంతో సాధారణ రైలు ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.