ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు ఆగ్రహం 

తమ అనుమతి లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ఉపసంహరించేందుకు ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా  స్పందించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా జీవోలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం డేంజర్‌ జోన్‌లో ఉందని వ్యాఖ్యానించింది.
ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చర్యలు ప్రారంభించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2020 సెప్టెంబరు 16న తేల్చిచెప్పిందని గుర్తు చేసింది. ఆ ఆదేశాలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసుల ఉపసంహరణకు జీవోలు ఇవ్వడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
కేసుల ఉపసంహరణ కోసం ముందుగా హైకోర్టు నుంచి అనుమతి కోరాలని, అనుమతి వచ్చిన తరువాతే ప్రభుత్వం తగిన ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అధ్యయనం చేయరా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హోంశాఖ జారీ చేసిన జీవోలను తాము కొట్టేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే ఓ పరిష్కారంతో కోర్టు ముందుకు రావాలని సూచించింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.
 2020 నవంబరు 16 నుంచి 2021 ఆగస్టు 25 వరకు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరించేందుకు ఎన్ని జీవోలు జారీ చేశారో పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు సిఫారసు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అందులో ప్రస్తావించింది.
మరోవైపు జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు వచ్చాయి.
హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చినా, ప్రక్రియ తుది దశకు చేరలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే కేసులు ఉపసంహరిస్తామని తెలిపారు. ఆ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.