అల్లూరిని స్మరించుకోవడం ఆనందదాయకం

ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ అల్లూరిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని,  అల్లూరి సీతారామరాజు మొట్టమొదటిసారిగా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. 
 
గిరిజనులు ఎక్కడున్నా తమ ప్రాంతాన్ని కాపాడుకునే విషయంలో వెనక్కు తగ్గరని అటువంటి వీరుల వంశం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు  బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేసేందుకు విప్లవ మార్గంలో ప్రజల్లో చైతన్యం రగిలించారని కొనియాడారు.
 
అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు శతాబ్ది ఉత్సవంలో మరో కేంద్ర మంత్రి జి  కిషన్ రెడ్డితో కలసి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. 
 
అనంతరం, అల్లూరి అతని అనుచరులు మొట్టమొదటగా దాడిచేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, అల్లూరి ప్రధాన అనుచరుడైన స్వాతంత్య్ర‌ సమరయోధుడు గంటం దొరకు సంబంధించిన 11 కుటుంబాలకు పక్కా ఇళ్ల పట్టాలను  అందజేశారు. 
 
మన్యం వీరుడి శౌర్యగాథలను ప్రస్తావిస్తూ డాక్టర్ కర్నం సత్యనారాయణ రాసిన పుస్తకాన్ని  కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. ఆదివాసీల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని  అర్జున్‌ ముండా  వివరించారు. చింతపల్లి ప్రాంతాన్ని మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేసి స్థానిక యువత ఉపాధి కల్పనకు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
 
కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.  గిరిజన యువతకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు అల్లూరి తెలుగువాడు కావడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. భారతీయ సంపదను దోచుకునేందుకు వచ్చిన బ్రిటిషర్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిన  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి మనమంతా పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
 
అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతానికో, ఉత్తరాంధ్ర ప్రాంతానికో చెందిన నాయకుడు మాత్రమే కాదని, యావద్భారతానికి ఆయ‌న‌ స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. అల్లూరి నడయాడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మొగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్‌ సహా అల్లూరి చరిత్రకు సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
 
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పీడిక రాజన్నదొర మాట్లాడుతూ కెడి.పేటలో అల్లూరి స్మృతి వనాన్ని రూ.66 లక్షలతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. తాజంగిలో రూ.35 కోట్లతో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మిస్తున్నామని తెలిపారు.  అరకు ఎంపి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొత్తగుల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.