యువమోర్చ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడితో ఉద్రిక్తం

టిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  బంజారాహిల్స్ రోడ్​ నంబర్​ 14లోని కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు.  వీరిని పోలీసులు అడ్డుకోవటంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.  దీంతో బీజేవైఎం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాం  కేసుపై రాష్ట్ర సర్కార్ విచారణ చేపట్టాలని వారు డిమాండ్​ చేశారు.   ఈసందర్భంగా బీజేవైఎం నాయకుడు గౌతమ్ రావు మాట్లాడుతూ.. ‘‘ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు వినిపిస్తోంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్సీ పదవికి కవిత  రాజీనామా  చేయాలి. లేదా ఎమ్మెల్సీ పదవి నుంచి కవితను తొలగించాలి. విచారణ కు సహకరించాలి”అని పేర్కొన్నారు. 
‘‘రాష్ట్రంలో  మద్యం ఏరులై పారుతుంటే.. ఢిల్లీలో లిక్కర్ టెండర్లలో కవిత అవినీతికి  పాల్పడింది. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి  కేసీఆర్​ వెంటనే రాజీనామా చేయాలి”అని గౌతమ్​ రావు డిమాండ్​ చేశారు.  ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట నిరసన తెలుపుతుంటే.. పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరించి కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్  ప్రమేయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. పంజాబ్ లో లిక్కర్ సిండికేట్ చేసేందుకు కేసీఆర్ ఆ రాష్ట్రానికి వెళ్లినట్టుగా అనుమానం వస్తుందన్నారు. ఢిల్లీ ఒబేరాయ్ హోటల్ లో ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదన్నట్టు ఇప్పుడు దేశంపై పడిందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త, బంధువుల ప్రమేయం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయని, దీనికి ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. 
 
లిక్కర్ కుంభకోణంలో కవిత ప్రధాన సూత్రధారి అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని చెబుతున్నారని ఆమె తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 
 
కేసీఆర్ కుటుంబం ఈడీ విచారణకు సిద్ధంగా ఉండాలని బీజేపీ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసిన అవినీతి నుంచి కేసీఆర్ కుటుంబం‌ తప్పించుకోలేదని అయన స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత  పాత్ర ఏంటనేది విచారణలో తేలుతుందని తెలిపారు. తప్పును కప్పిపుచ్చుకోవటానికి కవిత బీజేపీపై ఆరోపణలు చేయటం తగదని హితవు చెప్పారు. 
మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టి సీఎం కేసీఆర్ ను భయపెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
లిక్కర్ స్కామ్ పై ఏ దర్యాప్తు సంస్థతో అయినా విచారణ చేయించినా తాము సహకరిస్తామని ఆమె చెప్పారు. ఇటువంటి ఆరోపణలకు, విమర్శలకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో తన పాత్ర ఉందని ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాపై పరువు నష్టం దావా వేస్తానని ఆమె  ప్రకటించారు.