పార్టీ సాధారణ కార్యకర్త ఇంట్లో అమిత్ షా తేనీరు

హైదరాబాద్ కు చేరుకున్న  కేంద్ర హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్ లోని ఓ సాధారణ పార్టీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి  కళాసిగూడలో  వెళ్లారు. అమిత్ షాకు స్థానిక కార్పొరేటర్ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర హోం మంత్రిని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం సత్యనారాయణ అందించిన వేడివేడి కాఫీని షా తాగారు.

కాఫీ తాగుతూ.. సత్యనారాయణ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకోగానే స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపు చేశారు. సత్యనారాయణ ఇంట్లోకి కేవలం అనుమతి ఉన్న అతికొద్ది మందిని మాత్రమే అనుమతించారు.  షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.

ఈ సందర్బంగా అమిత్‌ షా మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం బలంగా పోరాడాలని సూచించారు. పార్టీ ప్రతీ ఒక్కరికీ గౌరవం దక్కుతుందని అమిత్‌ షా హామీ ఇచ్చారు.

‘‘ఈ రోజు మా జన్మ ధన్యమైంది. మొత్తం దేశానికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి .. చిన్నపాటి బస్తీలో ఉన్న మా  ఇంటికి రావడం నిజంగా గొప్ప అదృష్టం. మేం దీన్ని జీవితాంతం మర్చిపోలేం. నిన్నటి నుంచి మా కాలనీలో పండుగ వాతావరణం ఉంది. అమిత్ షా కోసం వేయికళ్లతో ఎదురుచూశాం. ఆయన మా ఇంటికి రాగానే ఆనందాన్ని ఆపుకోలేకపోయాం’’ అని బిజెపి కార్యకర్త సత్యనారాయణ ఆ తర్వాత చెప్పుకొచ్చారు.

మునుగోడులో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రాయానికి చేరుకున్న అమిత్ షాకు తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు 15 మంది కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రబాద్ లోని ఉజ్జయిని మహంకాళీ టెంపుల్ కు ఆయన చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో అమిత్ షాకు స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.

ఇలా ఉండగా, మునుగోడులో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ సభ  ‘మునుగోడు సమరభేరి’తో తెలంగాణలో ధర్మ యుద్ధం మొదలుకాబోతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ ధర్మయుద్ధంలో విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీకి ఓటేస్తే.. బావుల కాడ మీటర్లు రాలేదు కదా.. మరి మునుగోడులో మాత్రం బీజేపీకి ఓటేస్తే బావుల కాడ మీటర్లు ఎట్లొస్తయ్ ?’’ అని కేసీఆర్ ను ప్రశ్నించారు.