చైనా ‘రుణ’ యాప్‌లపై ఢిల్లీ పోలీసుల కొరడా

ఇన్‌స్టంట్‌ లోన్‌ పేరుతో.. చైనా కేంద్రంగా సాగుతున్న ‘రుణ’ యాప్‌ల రాకెట్‌పై ఢిల్లీ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ నెట్‌వర్క్‌కు చెందిన 22 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ. 5 వేలు.. రూ. 10వేలు.. ఇలా చిన్న మొత్తాల్లో రుణాలిచ్చే ఈ ముఠా రుణగ్రహీతలను బెదిరించి రూ. లక్షల్లో వసూలు చేస్తోంది.

ఈ గ్యాంగ్‌ గడిచిన ఏడు నెలల్లో రూ. 500 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీరి ‘రుణా’లు రూ. 2,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పైగానే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.  ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్‌ వింగ్‌– ఇం టెలిజెన్స్‌ ఫ్యూజన్‌ స్ర్టాటెజిక్‌ ఆపరేషన్‌(ఐఎ్‌ఫఎ్‌సవో) డీసీపీ కేపీఎస్‌ మల్హోత్రా కథనం ప్రకారం.. చైనా కేం ద్రంగా సాగుతున్న ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల బాధితుల నుంచి వందల ఫిర్యాదులు రావడంతో.. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

రెండు నెలల పాటు ఆపరేషన్‌ను కొనసాగించాయి. ఈ యాప్‌ల కాల్‌సెంటర్లు ఢిల్లీతోపాటు.. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఉన్నట్లు గుర్తించి, శనివారం ఏకకాలంలో దాడులు జరిపి 22 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారని, నవనీత్‌ కుమార్‌ భారతీ అనే వ్యక్తి భారత్‌లో ఈ ముఠాను నడిపిస్తున్న ప్రధాన నిందితుడని డీసీపీ తెలిపారు.

‘‘ఈ ముఠాను చైనా దేశస్థులు నడుపుతున్నారు. ఇన్‌స్టంట్‌ లోన్‌ పేరుతో గూగుల్‌ ప్లేస్టోర్‌లో వందల యాప్‌లను డంప్‌ చేశా రు. స్వల్పమొత్తంలో రుణాలు ఆఫర్‌ చేస్తారు. ఇలా రుణాలు తీసుకునేవారు ఆయా యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని, అడిగిన పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ యాప్‌లలో ఉండే స్పైవేర్‌/మాల్‌వేర్ల సాయంతో రుణగ్రహీతల స్మార్ట్‌ఫోన్లను తమ నియం త్రణలోకి తీసుకుంటారు. వ్యక్తిగత డేటాను హ్యాక్‌ చే స్తారు. ఆ తర్వాత.. అధిక వడ్డీలు వేసి.. తీసుకున్న రుణం కంటే.. ఎక్కువ మొత్తంలో చెల్లించినా.. ఇంకా ఇంకా బకాయి పడ్డారంటూ వేధిస్తారు.

రుణగ్రహీతలు తిరగబడితే.. వారి ఫొటోలను మార్ఫ్‌ చేసి, అశ్లీల (న్యూడ్‌) చిత్రాలుగా మారుస్తారు. వాటిని కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారికి పంపుతామని బెదిరిస్తారు. కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారికి మీ మిత్రుడు/బంధువు రుణ ఎగవేతదారు అంటూ సందేశాలు పంపుతారని డీసీపీ వివరించారు.

రుణగ్రహీతల నుంచి చేసే రికవరీ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీ, హవాలా మార్గాల్లో చై నాకు తరలిస్తారని తెలిపారు. ఈ యాప్‌ల సర్వర్లన్నీ చైనాలోని హాంకాంగ్‌లో ఉన్నాయన్నారు. సమాజంలో తమ పరువు పోతుందనే భయం.. అప్రతిష్ఠ పాలవుతామనే బెంగతో చాలా మంది వారు అడిగిన మొత్తా న్ని చెల్లిస్తున్నారని, మరికొందరు ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారని వివరించారు.

“ఈ గ్యాంగ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను బట్టి.. రోజుకు రూ. కోటి మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించాం. చైనాలో ఉంటున్న ప్రధాన నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశాం. భారత్‌లోని వేర్వేరు రాష్ట్రాల పోలీసులు దాడులు పెంచడంతో.. చైనీయులు తమ కాల్‌సెంటర్లను పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు తరలించారు’’ అని డీసీపీ తెలిపారు.