నితీష్ – తేజస్వి మధ్య పొత్తు కుదిర్చిన పిఎఫ్ఐ!

బీహార్ లో ఎన్డీయే ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని కూల్చి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీ నేత తేజస్వీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) హస్తం ఉన్నదని బిజెపి తీవ్రమైన ఆరోపణ చేసింది. ఈ సంస్థయే వారిద్దరి మధ్య పొత్తు కుదిర్చినదని బిజెపి బీహార్ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ స్పష్టం చేశారు. 

ఉగ్రవాద మూకలతో కలిసి భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు పీఎఫ్‌ఐ సంస్థకు చెందిన ఇద్దరిని పాట్నాలో అరెస్ట్ చేసి ఎన్‌ఐఏకు అప్పగించినప్పటి నుంచీ రగడ మొదలైందని ఆయన వెల్లడించారు. ఓ వర్గం ఓట్ల కోసం జేడియూ, ఆర్జేడీ సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడ్డాయని ఆయన ధ్వజమెత్తారు.

వాస్తవానికి రంజాన్ సమయంలో మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందు సమావేశంలో జేడియూ, ఆర్జేడీ మధ్య చర్చలు మొదలై చివరకు పొత్తుకు దారితీశాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూడు నెలలుగా జేడియూ, ఆర్జేడీ నేతల మధ్య పొత్తులు, అధికార పంపిణీపై చర్చలు జరుగుతున్నాయని కమలనాథులు ఆరోపించారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడియూకు తమ కన్నా తక్కువ సీట్లు వచ్చినా నితీశ్‌ను ముఖ్యమంత్రిని చేస్తే తమకు వెన్నుపోటు పొడిచారని, దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.