కోటికి పైగా జెండాలు విక్రయించిన తపాలా కార్యాలయాలు

ఇంటింటా జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారు. తపాలా కార్యాలయాల ద్వారా ఇప్పటికే 1 కోటికి పైగా జెండాలను ప్రజలకు అందజేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియా పోస్ట్ ద్వారా జెండాలను ఇంటి వద్దనే అందజేస్తున్నట్లు తెలిపింది.
తపాలా శాఖ దేశవ్యాప్తంగా ప్రతి పౌరుని వద్దకు ఇంటింటా జాతీయ జెండా (హర్ ఘర్ తిరంగా) కార్యక్రమాన్ని తీసుకెళ్ళిందని తెలిపింది. దేశవ్యాప్తంగా తపాలా శాఖకు 1.5 లక్షల కార్యాలయాలు ఉన్నాయని, వీటి ద్వారా 10 రోజుల్లో ఒక కోటికి పైగా జాతీయ జెండాలను ప్రజలకు అందజేసిందని పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారికి కూడా జాతీయ జెండాలను అందజేసినట్లు తెలిపింది.
జాతీయ జెండాలను చౌక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఒక్కొక్క త్రివర్ణ పతాకాన్ని రూ.25 చొప్పున అమ్మినట్లు పేర్కొంది. ఆన్‌లైన్ సేల్స్‌కు బట్వాడా (డెలివరీ) ఛార్జీలను వసూలు చేయలేదని వివరించింది. దేశంలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగానే డెలివరీ చేసినట్లు తెలిపింది.
 ఈ-పోస్టాఫీస్ సదుపాయం ద్వారా ఆన్‌లైన్‌లో 1.75 లక్షల జాతీయ జెండాలను విక్రయించినట్లు పేర్కొంది.  4.2 లక్షల మంది తపాలా ఉద్యోగులు దేశంలోని అన్ని ప్రాంతాలవారికీ అత్యంత ఉత్సాహంగా జాతీయ జెండాలను అందజేస్తున్నారని తెలిపింది.
నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పర్వత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల వారికి త్రివర్ణ పతాకాలను చేరవేస్తున్నారని పేర్కొంది.  అంతేకాదు, ప్రదర్శనలు, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయమని కోరుతూ విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టింది. సోమవారం వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.
భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమాన్ని ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రజలు జాతీయ జెండాను తమ ఇళ్లకు తీసుకెళ్లి, స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి పౌరుడిని జాతీయ పతాకం ఎగురవేసే విధంగా ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టింది. ఎవరైనా తమ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి జాతీయ పతాకంను పొందవచ్చు. లేదా ఆన్ లైన్ ద్వారా ఇంటికే తెప్పించుకోవచ్చు. జాతీయ పతాకంతో దిగిన ఫోటోలను
www.harghartiranga.com లో అప్ లోడ్ చేయడం ద్వారా ఈ మహత్తర జాతీయ ఉత్సవాలలో తాము పాల్గొంటున్నట్లు నమోదు చేసుకోవచ్చు. 
 
దేశ ప్రజలలో దేశభక్తి భావాలను రేకేకేతించడం, జాతీయ పతాకం పట్ల అవగాహన కలిగించడం కోసమై ఈ కార్యక్రమం చేపట్టారు. జాతీయ పతాకం కేవలం జాతీయ పర్వదినాలలో నాయకులు, సంస్థాగతంగా ఎగురవేసే పతాకం మాత్రం కాదని, ప్రతి వ్యక్తికి దానితో అనుబంధం ఉన్నదనే భావాత్మక అనుబంధం కలిగించే ప్రయత్నంగా చేస్తున్నారు.