నరేంద్ర మోదీ  నేతృత్వంలోనే మరోసారి ప్రభుత్వం 

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయే నుండి వైదొలిగిన్నప్పటికీ   ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే మళ్ళీ  కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని తాజా సర్వే అంచనా వేసింది. అయితే ఎన్డీయేకు కొద్దిపాటు స్థానాలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. దేశాన్ని నడిపించే నాయకుడిగా అత్యధిక ప్రజాదరణ మోదీకి మాత్రమే ఉందని పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికలకు సుమారు రెండేళ్ళ సమయం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 286 స్థానాల్లో ఎన్డీయే గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే మ్యాగజైన్ నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది.  ఎన్డీయే నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ వైదొలగినందువల్ల దాదాపు 21 స్థానాలను ఎన్డీయే కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేసింది.
అంతకుముందు ఇదే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఎన్డీయే కూటమికి 307 స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ సర్వేలను సీ-ఓటర్ అనే సంస్థతో కలిసి నిర్వహించారు. యుపిఎకు 125, ఇతర పార్టీలకు 111 అని అంచనా వేసింది.  అయితే,  తాజా బీహార్ పరిణామాలతో బిజెపి సీట్లు 286కు తగ్గి, యుపిఎకు 146 సీట్లు రావచ్చని భావిస్తున్నారు. ఈ సర్వేలో ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు 1,22,016 మంది పాల్గొన్నట్లు ఇండియా టుడే మ్యాగజైన్-సీ-ఓటర్ సర్వే నిర్వాహకులు తెలిపారు.
ఈ సర్వేలో అత్యధిక భాగం ఎన్డీయే నుంచి జేడీయూ వైదొలగక మునుపు జరిగినట్లు తెలిపారు. ఎన్డీయే నుంచి జేడీయూ వైదొలగిన తర్వాత నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు జరగబోయే నష్టం వెల్లడైనట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు లోక్‌సభలో 300కుపైగా ఎంపీల బలం ఉంది. ఇదిలావుండగా, దేశంలో అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కరోనా మహమ్మారి వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులందరికన్నా అత్యధిక ప్రజాదరణను పొందుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ప్రజాదరణతో ప్రధాని నరేంద్ర మోదీకి సమీపంలో మరే నాయకుడు లేరని ఈ సర్వే స్పష్టం చేస్తుంది. 
తదుపరి ప్రధాన మంత్రిగా మోదీకి 53 శాతం మంది ఓటు వేశారని తెలిపింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేవలం 9 శాతం మంది, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు 7 శాతం మంది మాత్రమే మద్దతు పలికారని చెప్పింది.  కాగా, బీహార్ లో సహితం ప్రధాన మంత్రిగా 44 శాతం మంది నరేంద్ర మోదీ తిరిగి రావాలని కోలుకుంటుండగా, నితీష్ కుమార్ పేరు 22 శాతం మంది మాత్రమే చెప్పారు. 18 శాతం మంది రాహుల్ గాంధీ పేరు చెప్పారు. 
తెలంగాణాలో బిజెపికి 6 సీట్లు 
కాగా, ప్రస్తుతం తెలంగాణాలో బిజెపికి 6 సీట్లు రాగలవని, టిఆర్ఎస్ కు 7, కాంగ్రెస్ కు 3, ఎంఐఎంకు 1 సీట్ అని ఈ సర్వే తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీకి 18, టిడిపికి 7 సీట్లు రావచ్చని అంచనా వేసింది.