ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేసీఆర్.. రాష్ట్రపతికి ఫిర్యాదు

కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని బీజేపీ ఎంపీ సోయం బాబూరావు ఆరోపించారు. పోడు భూములు సాగుచేసుకుంటోన్న ఆదివాసీలపై అధికారులు, పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోమవారం బాబూరావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను తెలంగాణాలో కేసీఆర్ పాలనలో ఆదివాసీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆదివాసీ ప్రజల సమస్యల గురించి రాష్ట్రపతికి వివరించానన్న ఎంపీ ఆదివాసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న పలు సమస్యల గురించి మోదీ, అమిత్ షాకు వివరించినట్లు పేర్కొన్నారు. 

ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పిన కేసీఆర్  ఇవాళ ఆదివాసీలు పోడు సాగు చేసుకుంటుంటే అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఏళ్ల తరబడి ప్రజలు వెయిట్ చేస్తున్నారని, అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదన్న ఆయన ఇప్పటికైనా అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారన్న ఎంపీ, అందుకు స్పందించిన కేంద్రం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అంగీకారం తెలిపిందని చెప్పారు.

ఎయిర్ పోర్ట్ కోసం మొత్తం 650 ఎకరాలు అవసరమని చెబుతూ,  అయితే కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భూమి ఇవ్వడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భూమి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ – ఆర్మూర్ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 50 శాతం నిధులను కేటాయించాలని కోరారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పట్టించుకోరా? అంటూ  బాబూరావు కేసీఆర్ ను నిలదీశారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నా  రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. 

హక్కుల సాధన కోసం పోరాటం చేయటం విద్యార్థుల హక్కు అని చెప్పిన ఎంపీ, నిరసనకు దిగిన విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి  గవర్నర్ తమిళి సై బాసరకు వెళ్తే  కనీసం ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని మండిపడ్డారు.

ఇప్పటికైనా బాసర విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.