దేశంలోనే ఉస్మానియా వర్సిటీ 22వ ర్యాంక్.. గవర్నర్ అభినందనలు

విశ్వవిద్యాలయాల విభాగంలో భారత ప్రభుత్వ ఎన్ఐఆర్ఎఫ్ – 2022 ర్యాంకింగ్‌లో అపూర్వమైన 22వ ర్యాంక్ సాధించడంపై రాజ్‌భవన్‌లో ఉస్మానియా వైస్-ఛాన్స్లర్‌, ప్రొఫెసర్ డి. రవీందర్ను గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నత విద్యారంగంలో ముందంజలో ఉంటూ ఎంతో కాలంగా పేరుగాంచిన విశ్వవిద్యాలయంగా నిలుస్తోందని కొనియాడారు.

దీని పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని అనేక రంగాలలో ఉన్నారని పేర్కొంటూరానున్న కాలంలో యూనివర్సిటీ మరిన్ని విజయాలు సాధిస్తుందని అశిస్తున్నట్టు ఆమె చెప్పారు.  ఇతర యూనివర్సిటీలు తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఉస్మానియా వర్సిటీ వైపు చూస్తున్నాయని కూడా చాన్స్లర్ తమిళిసై అభినందించారు.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం కూడా ఎంతో హైలైట్గా నిలుస్తోంది. భవిష్యత్తులో ర్యాంకింగ్‌ను కొనసాగించడానికి అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పండితులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది గవర్నర్ తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, వైస్-చాన్స్లర్, ప్రొఫెసర్ డి రవీందర్ తనకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు చాన్స్లర్, గవర్నర్ తమిళిసైతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో దాని స్థానాన్ని మెరుగుపరిచేలా కృషిచేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ బి. రెడ్యా నాయక్‌, ఓఎస్‌డీ టు వీసీ తదితరులు పాల్గొన్నారు