రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నికకు రంగం సిద్ధం

గత వారం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన శాసనసభ్యత్వ రాజీనామా పత్రాన్ని  శాసనసభ భవనంలోని ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డికి అందజేయడం, ఆయన ఆమోదించడం చక చక జరిగిపోయాయి. దానితో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నికకు రంగం సిద్దమైంది. 
 
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మీడియాతో డుతూ తన రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక పై ప్రజలు మాట్లాడుకుంటున్నారని వివరించారు. ఎందుకు ఉప ఎన్నిక వస్తోందో తెలుసుకోవాలని, స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరని,  మునుగోడు ప్రజల పై ఉన్న నమ్మకం తో రాజీనామ చేశానని స్పష్టం చేశారు. 
 
దైర్యం లేకపోతే తాను ఈ పని చేసే వాడిని కాదని చెబుతూ  తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఇది తర కోసం చేసే యుద్ధం కాదని,  ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉందని కోమటి రెడ్డి తెలిపారు. ఈ నెల 21న తన నియోజకవర్గంలో జరిగే బహిరంగసభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే ఆయన ప్రకటించారు. 
 
దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఆకలినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ చేతిలో ఆత్మగౌరవం బంధీ అయ్యిందని విమర్శించారు.  మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లు తెలిపారు. కుటంబ పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా అనగానే కొత్తగా గట్టుప్పల్ మండలం వచ్చిందని గుర్తు చేశారు. 
 రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాలకే స్పీకర్‌ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నేడు ఈసీకి స్పీకర్‌ కార్యాలయం సమాచారం ఇ‍వ్వనుంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు నవంబర్ లో మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.