బీజేపీ ప్రభుత్వంలో ఇళ్లులేని చేనేత కార్మికులందరికీ ఇండ్లు

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అట్లాగే చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ కల్పిస్తామని చెప్పారు. ఇల్లు లేని పేద చేనేత కార్మికులందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. 
 
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఐదవ రోజు ముక్తాపూర్ నుండి పాదయాత్ర ప్రారంభించిన సంజయ్ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచంపల్లిలో నిర్వహించిన చేనేత కార్మికుల సమ్మేళనంలో పాల్గొంటూ  రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలకు, వారు అనుభవిస్తున్న దుర్భర జీవితాలకు ముమ్మాటికీ కేసీఆరే బాధ్యుడని విమర్శించారు.
ఎన్నికలొస్తే డబ్బులిస్తే ఓట్లేస్తారనే అహంకారంతో విర్రవీగుతున్న సీఎం కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. చేనేత సహకార ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్, చేనేత రంగ బలోపేతం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సహా పలువురు నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. “ఆరు గజాల చీరెను అగ్గిపెట్టెలో పెట్టేంత నేసే చేనేత అన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న… ‘ఇక్కత్’ చీరెలకు పుట్టిల్లు ఇది. 70 ఏళ్ల క్రితమే ఇక్కత్ కళను ప్రపంచానికి పరిచయం చేసిన కర్నాటి అనంతరాములు జన్మనిచ్చిన ప్రాంతం. నాకు రాజకీయ జన్మనిచ్చిన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రామాంజనేయచారి పుట్టిన గడ్డ ఇది” అంటూ పేర్కొన్నారు.
 
 అందితే జుట్టు అందకపోతే కాళ్లు పెట్టే నైజం కేసీఆర్ ది అంటూ గత ఎన్నికల్లో నెలకు 15 వేల కనీస వేతనం ఇస్తానన్నడు, నూలుదారంపై సబ్సిడీ ఇస్తానన్నడు… ఆ హామీలేమైనయ్? అంటూ సంజయ్ ప్రశ్నించారు. ఇవాళ చేనేత కుటుంబాలకు పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
రూ 100 కోట్లతో మిత్ర పథకాన్ని తెస్తానని మాట తప్పిన  కేసీఆర్… చేనేత బీమా ఏడాది క్రితం ప్రకటించిండు. నేను 3వ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ అంశాన్ని లెవనెత్తి నిలదీసిన. ఈరోజు పోచంపల్లిలో సభ పెడుతున్నానని తెలిసి ఇయాళ చేనేత బీమాను అమలు చేస్తుండు అంటూ విమర్శించారు. 
 
చేనేత కార్మికులు 8 ఏళ్లలో 360 మంది చనిపోతే పట్టించుకోని కేసీఆర్ అక్కడెక్కడో పంజాబ్ లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆదుకుంటాడట అంటూ ఎద్దేవా చేశారు.   రైతుల నుండి కొనుగోలు చేస్తున్న పంటను కొంటున్నట్లుగానే బీజేపీ అధికారంలోకి వస్తే చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
 
జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించి చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అని కొనియాడారు. విదేశాలకు చేనేత ఎగుమతుల ద్వారా రూ 8 వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న సర్కార్ మోదీదే అని తెలిపారు. 
వాజ్ పేయి హయాంలో పోచంపల్లిలో కలర్స్ డైయింగ్ టెక్నాలజీని పోచంపల్లికి అందించారని సంజయ్ గుర్తు చేశారు. నేషనల్ హ్యండ్లూం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ కార్డున్న ప్రతి చేనేత కుటుంబానికి 15 నుండి 20 రోజుల ఉపాధి, 6 కిలోల దారంపై సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.
 
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, మహాత్మా గాంధీ బంకర్ భీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన ద్వారా గత 8 ఏళ్లలో రాష్ట్రంలోని 42 వేల 886 మందికి   కింద భీమా సాయం అందించిన ఘనత మోదీదే అని స్పష్టం చేశారు.