కామన్వెల్త్ గేమ్స్ లో తెలంగాణ అమ్మాయిలు నిఖిత, శ్రీజలకు బంగారం

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతుంది. ఆదివారం  ఒక్క రోజే భారత బాక్సర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 48 కేజీల మినిమమ్‌ వెయిట్‌ విభాగంలో నీతూ గంగాస్‌ స్వర్ణంతో బోణీ కొట్టగా, ఆతర్వాత నిమిషాల వ్యవధిలోనే పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్‌ పంగాల్‌ పసిడి పంచ్‌ విసిరాడు.
తాజాగా మహిళల 48-50 కేజీల లైట్‌ ఫ్లై విభాగంలో తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ మరో స్వర్ణం సాధించింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, రజతం రాగా, 10 కిలోమీటర్ల రేస్ వాక్‌లో కాంస్య పతకం లభించింది. ఫైనల్లో జరీన్‌.. నార్త్రన్‌ ఐర్లాండ్‌ బాక్సర్‌ కార్లీ మెక్‌నౌల్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి, భారత్‌కు మూడో బాక్సింగ్‌ స్వర్ణాన్ని అందించింది.
టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ (భారత్‌) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్‌ కమల్‌ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్‌ చూంగ్‌–లిన్‌ కరెన్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్‌ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్‌గా 53వ పతకం చేరాయి.
మరోవైపు పురుషుల డబుల్స్‌ ఫైనల్లో శరత్‌ కమల్‌–సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ (భారత్‌) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్‌ డ్రింక్‌హాల్‌–లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ (ఇంగ్లండ్‌) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది.
పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ (17.03 మీటర్ల జంప్) పసిడి పతకం సాధించగా, అబ్దుల్లా అబూబాకర్ (17.02 మీటర్లు) రజతం చేజిక్కించుకున్నాడు. 10 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సందీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. ఖత్ జరీన్ బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించి భారత స్వర్ణాల సంఖ్యను  17కు పెంచింది. మహిళల 50 కేజీల ఫ్లైవెయిట్ ఫైనల్స్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కార్లీ మెక్‌నాల్‌ను చిత్తు చేసి కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని అందుకుంది. నిఖత్‌కు ఇది హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ కావడం విశేషం.
26 ఏళ్ల నిఖత్ ఈ సీజన్‌లో ఇప్పటికే  2వ స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా కామన్వెల్త్‌లో మూడో పసిడిని పట్టేసింది. ప్రపంచ చాంపియన్‌, తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన పంచ్‌ పవర్‌ చూపింది. ఆదివారం జరిగిన మహిళల 50 కిలోల ఫైనల్లో జరీన్‌ ధాటికి ప్రత్యర్థి బెంబేలెత్తింది.
గత ఏడాది జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప నుంచి తిరుగులేని ఫామ్‌లో ఉన్న జరీన్‌ టైటిల్‌ ఫైట్‌లో 5-0తో కార్లీ మెక్‌నాల్‌ (నార్తర్న్‌ఐలాండ్‌)ను మట్టికరిపించింది. దాంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో బరిలో దిగిన తొలిసారే పసిడి పతకంతో నిఖత్‌ తన హవా చాటింది. కామన్వెల్త్‌ కోసం 52 నుంచి 50  కేజీల విభాగానికి మారిన నిఖత్‌.. పదునైన పంచ్‌లతో విరుచుకుపడి మెక్‌నాల్‌ను వణికించింది.  తెలంగాణ బాక్సర్‌ ఏస్థాయిలో చెలరేగిందంటే.. తొమ్మిది నిమిషాల బౌట్‌ ముగిసే సరికి విజేత ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయింది.
 కాగా, స్క్వాష్‌ ఈవెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సౌరవ్‌ ఘోషాల్‌–దీపిక పల్లికల్‌ జంట భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సౌరవ్‌–దీపిక ద్వయం 11–8, 11–4తో డోనా లోబన్‌–కామెరాన్‌ పిలె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించి కాంస్యం నెగ్గింది. తద్వారా భారత్‌ ఖాతాలో 50వ పతకం చేరింది. ఇటీవలే ఇద్దరు కవలలకు తల్లైన దీపిక పల్లికల్‌.. ప్రముఖ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ భార్య అన్న విషయం తెలిసిందే.
సెమీస్‌లో వరుస సెట్లలో విజయం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు  ఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసింది. ఇండియన్ షట్లర్ లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. హాకీలో భారత అమ్మాయిలు కాంస్య పతకం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు.
నిఖత్‌ జరీన్‌ స్వర్ణం గెలవడం పట్ల ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు నిఖత్‌ను అభినందనలతో ముంచెత్తారు. నిఖత్‌.. భారత్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని.. నిఖత్‌ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైంది, నిఖత్‌.. తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.