దళితులు కేసీఆర్ ను చావుదెబ్బ కొడతారు 

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికలలో దళితులంతా ఓటు బ్యాంకుగా తయారై కేసీఆర్ను చావు దెబ్బ కొడతారని బిజెపి యస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య ధీమా వ్యక్తం చేశారు. బిజెపి యస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ రూరల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ లోని ఆర్ వి కె పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో దళితులు విసిగి వేజారిపోయారని దళితులు అంటే అసలు కేసీఆర్ కు కనీస గౌరవం లేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడబోయే బిజెపి ప్రభుత్వంలో దళితులకు ఉన్నత స్థానం ఉండే విధంగా పార్టీ ఆలోచన చేస్తుందని ఆయన చెప్పారు.  పైగా, తెలంగాణలో నూతనంగా ఏర్పాటు కాబోయే బిజెపి ప్రభుత్వములో యస్సిమోర్చ ప్రాత ప్రధానంగా ఉంటుందని కూడా తెలిపారు.
 దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను తీవ్రంగా అగౌరపరచిన విషయాలను రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రజలకు  తెలియ చేయాలని సూచించారు.  75 ఏళ్ల స్వతంత్ర భారతంలో 50 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పరిపాలించిన ఏ ఒక్క రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వాలని ఆలోచన రాకపోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరికి నిదర్శనం అని గుర్తు చేశారు
భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారత చరిత్రపుటల్లో అంబేద్కర్ స్థానాన్ని కేవలం దళిత వర్గాల పక్షాన పోరాడిన నాయకుడికే పరిమితం చేసినటువంటి సందర్భాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు 
అంబేద్కర్  దళితుల కోసమే కాకుండా మహిళల కోసం, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం పోరాటం చేశారని ఆయన చెప్పారు. సమాజంలో ఉన్న దురాచారాలను పోగొట్టేందుకు నిర్విరామ కృషి చేసిన అంబెడ్కర్ అన్ని వర్గాల ఆరాద్యుడు అని స్పష్టం చేశారు.
 
కాబట్టి అంబేద్కర్ అందరివాడు, జాతీయ నేత అంటూ ఆర్య  కొనియాడారు. దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా అధ్యక్షత వహించారు. బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి, ఎస్పీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.