బీజేపీ బలపడటాన్ని కేసీఆర్ ఓర్వలేకపోతున్నడు

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ధ్వజమెత్తారు. దేశ అభివృద్ధిపై చర్చించే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ రాకపోవడం సరికాదని స్పష్టం చేశారు.
 ‘‘ సమావేశానికి రాకపోతే రాకండి.. కానీ నీతి ఆయోగ్ లాంటి వ్యవస్థలపై రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు.  రావడం ఇష్టం లేకుంటే.. ఫామ్  హౌజ్ లోనే ఉండండి’’ అని అంటూ ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ గతంలో ర్యాంకులు ప్రకటిస్తే.. అవార్డులు ఇస్తే జబ్బలు చర్చుకున్న కేసీఆర్ సర్కారు ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల కేసీఆర్ వ్యవహార శైలి మారిందని చెబుతూ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుంటే చూసి ఓర్వలేక..  ప్రధాని మోదీపై, నీతి ఆయోగ్ లాంటి కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలపై కేసీఆర్ దుష్ప్రచారానికి తెగబడ్డారని ఆయన తెలిపారు.
దళిత ముఖ్యమంత్రిని కేసీఆర్ ఎందుకు చేయలేదు? దళితులకు మూడు ఎకరాల  భూమిని ఎందుకు పంపిణీ చేయడం లేదు? అని కేసీఆర్ ను కిషర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు భూములు గుర్తించి, పేద ప్రజలకు ఎన్ని ఇళ్లయినా కట్టించుకునే వెసులుబాటును కేంద్ర సర్కారు కల్పించిందని గుర్తు చేశారు.
అలా ఎన్ని ఇళ్లు నిర్మించినా కేంద్రం కోటా నిధులు విడుదల చేస్తోందని స్పష్టం చేశారు. కేంద్రానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో.. తెలంగాణలో ఈ పథకాన్ని కేసీఆర్ సర్కారు అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకూ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 15 మంత్రిత్వ శాఖలు కేసీఆర్‌ కుటుంబం చేతుల్లో ఉన్నాని చెబుతూ  కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
 ప్రతి ఇంటిపై జాతీయ జెండా
ఈనెల 11న విభజన దినోత్సవం నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. దేశవిభజన సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయని, వాటికి అద్దంపట్టే ఫొటోలతో  పార్లమెంట్ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా ఈనెల 13 నుంచి 15 వరకు దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని దాదాపు 20 కోట్ల ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేస్తామని వెల్లడించారు. 155 దేశాల్లో ఉన్న భారతీయుల ఇళ్లపైనా జాతీయ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.