బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో గవర్నర్‌ తమిళిసై

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల పర్యటనలో భాగంగా గవర్నర్ డా. తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం ఉదయం కొంతకాలంగా సమస్యలతో ఆందోళనలు చేబడుతున్న బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థులతో కలియతిరిగి, ముచ్చదించారు.  విద్యార్ధులతో మాట్లాడి వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.  విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు, వాష్‌ రూంలను పరిశీలించారు. విద్యార్థులు హాస్టల్ సమస్యలతో పాటు అకాడమిక్ సమస్యలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. 

అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద గవర్నర్ మీడియాతో తాను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. విద్యార్థుల సమస్యలను  పరిష్కరించాలని వచ్చానని, ఆహారం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవేనని, సానుకూల దృక్పథంతో  సమస్యలను  పరిష్కరించాలని అధికారులకు సూచించానని చెప్పారు. 

సెక్యూరిటీ  సమస్యలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, అధ్యాపకుల భర్తీతో సహా టైమ్ బాండ్ ప్రకారం సమస్యలను  పరిష్కరించాలని, విలువలతో కూడిన విద్య, స్నేహపూర్వక వాతావరణం కలిపించాలని అధికారులకు సూచించినట్లు గవర్నర్ తమిళిసై వివరించారు. 

గత కొన్ని రోజులుగా బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు పడకేసిన విషయం తెలిసిందే. అయితే.. సమస్యలు ఎదుర్కొంటున్నామని ఇప్పటికే విద్యార్థులు పోరుబాట పట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వెళ్లి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

అయితే.. ఇప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్రిపుల్‌ ఐటీ పరిశీలించారు. అంతక ముందు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అమ్మవారి దీవెనలతో అందరూ బాగుండాలని కోరుకున్నారని తెలిపారు.