బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్‌

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్  బిజెపిలో చేరారు. ఢిల్లీలో  బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రవణ్‌కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబిసి మోర్చా అధ్యక్షుడు,  ఎంపీ లక్ష్మణ్‌, మురళీధర్ రావు,  వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.కాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్ర‌వ‌ణ్‌ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.  తెలంగాణలో  సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్, ఆయనతో పాటు కొంతమంది మద్దతుదారులు బీజేపీలో చేరడం పట్ల తరుణ్ ఛుగ్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడిన దాసోజు శ్రవణ్ నరేంద్ర మోదీ,  బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.  విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశానని చెబుతూ ఇప్పుడు సొంతింటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. 60 వేల అప్పు ఉన్న రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టు పూర్తి కాలేదని పేర్కొంటూ  30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుని లక్ష 15 వేల కోట్లకు పెంచిండని ధ్వజమెత్తారు.

శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ ఛుగ్‌తో ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి దాసోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇక ఈ నెల 21 న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి లో చేరనున్నారు. అదే రోజు మరికొంతమంది కాంగ్రెస్ , టిఆర్ఎస్ నేతలు బిజెపి లో చేరనున్నట్లు సమాచారం.