ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ఘన విజయం

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి  మార్గరెట్ ఆళ్వా పై 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల్లో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా అందులో జగదీప్ కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.  లెక్కింపు పూర్తైన అనంతరం ఉప రాష్ట్రపతిగా  ధన్కర్ ఎన్నికైనట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రకటించారు.
ఫలితం ప్రకటించగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు జె పి నడ్డా ధన్కర్ బసచేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము కూడా ఆయన్ను అభినందిస్తూ.. ధన్‌ఖడ్‌ ఎన్నికతో దేశ ప్రజలకు లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుత ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ సీనియర్‌ రాహుల్‌ గాంధీ, యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్‌ అల్వా తదితరులు కూడా ధన్‌ఖడ్‌కు నేరుగా.. ట్విటర్‌లో అభినందనలు తెలిపారు.
ఈ నెల 11న ఆయన భారత దేశపు 14వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ, లోక్ సభకు చెందిన మొత్తం 780 ఎంపీలకు ఓటు హక్కు ఉండగా 725 మంది ఓటు వేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా 92.94 శాతం మంది ఓట్లు వేసినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.
శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు హాలులో ఓటింగ్ మొదలై సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభమై ముగియడంతో ధన్‌కఢ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. మార్గెరెట్ ఆల్వా ఎంపిక విషయంలో తమను సంప్రదించలేదంటూ కినుక వహించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. 
 
అయితే సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి, దిబ్యేందు అధికారి ఓటు వేశారు. 34 మంది టీఎంసీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు వేశారు
 1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్‌ రాజస్థాన్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

యువకుడిగా ఉండగానే ధన్‌ఖడ్‌ జనతాదళ్‌లో చేరారు. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ వ్యవస్థాపకుడు దేవీలాల్‌ అడుగుజాడల్లో నడిచారు. ఆయన ఆశీస్సులతో 1989లో ఝుంఝును నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాటి వీపీ సింగ్‌ సర్కార్‌ నుంచి దేవీలాల్‌ బయటికొచ్చినప్పుడు ధన్‌ఖడ్‌ ఆయన వెంటే నడిచారు. చంద్రశేఖర్‌ కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చేశారు.

పీవీ నరసింహారావు హయాంలో ఆయన విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో అశోక్‌ గెహ్లాట్‌ హవా పెరుగుతూండటంతో 2003లో బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీలో వసుంధర రాజెకు దగ్గరయ్యారు. కానీ రాజకీయంగా పెద్దగా ఎదగలేదు.

పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు లాయర్‌గా మంచి పేరు సంపాదించారు. 2019 జులైలో పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. జగదీప్ ధన్కర్ రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షునిగా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు.

జాట్ల నేత కావడం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఆయన్ను ఎంచుకోవడంలో కీలకంగా నిలిచింది. లాయర్‌గా లోతైన పరిజ్ఞానం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా అనుభవం అదనపు అర్హతలు మారాయి. ఎన్డీఏకు ఇంకా పూర్తి మెజారిటీ లేని రాజ్యసభలో త్వరలో కీలక బిల్లుల ఆమోదం ఉన్నందున న్యాయ, పాలనా, రాజ్యాంగపరంగా లోతుపాతులు తెలిసిన వ్యక్తి చైర్మన్‌గా ఉండనుండటం బీజేపీకి ఊరటే.
జగదీప్‌ భార్య సుదేశ్‌ సామాజిక కార్యకర్త. ఆర్థికశాస్త్రంలో పీజీ చేశారు. కుమార్తె కామ్నా సుప్రీంకోర్టు లాయర్‌ కార్తికేయ వాజపేయిని పెళ్లి చేసుకున్నారు. ధన్‌ఖడ్‌కు క్రికెట్, ప్రయాణాలు చాలా ఇష్టం. దేశ విదేశాలు విపరీతంగా తిరిగారు. కుటుంబంతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతి ముర్ము మాదిరిగానే ఆయన కూడా ఆధ్యాత్మిక బాటలో ఉన్నారు.